కొండపల్లి గడ్డపై టీడీపీ జెండా ..
కొండపల్లి మున్సిపల్ పోరు రసవత్తరంగా సాగింది. కౌంటింగ్ సమయంలో కొండపల్లి మున్సిపాలిటీలో అధికారపార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నువ్వా – నేనా అంటూ తలబడ్డాయి. ఈ పోరులో వైసీపీ – 14, టీడీపీ -15 కౌన్సిలర్ స్థానాలను ఇరు పార్టీలు కౌవసం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఎక్స్-అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారడంతో కథ రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కొండపల్లిలో ఓటు నమోదు చేసుకున్నారు. ఓటు హక్కు నమోదు ప్రక్రియకు ఆదేశాలివ్వాలని జిల్లా రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఎంపీ లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ హైడ్రామాకు తెరతీశారు. నమోదు ప్రక్రియను జాప్యం చేసేందుకు ఆరోగ్యం బాగాలేదని కమిషనర్ ఆసుపత్రిలో చేరడాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. ఈ తొండాటకు తిక్కరోగం న్యాయస్థానాల్లోనే కుదిరిస్తామని ఎంపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసర విచారణ చేయాలని కోరిన పిదప ఎంపీ కేశినేనికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో టీడీపీ మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించి, చైర్మన్ చైర్ ను దక్కించుకునేందుకు సంఖ్యబలం చేకూరింది. టీడీపీ ఖాతాల్లో దర్శితో పాటు కొండపల్లి కూడా చేరిందని నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.











