తెలంగాణలో ఆ ఇద్దరే కేంద్రంగానే పరిపాలన సాగుతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఏ నిర్ణయం అయినా వారిద్దరే తీసుకోవాలి. చిన్నచిన్న నిర్ణయాల నుంచి చట్టాల మార్పు వరకు వారు చెప్పినట్టే నడవాలి. వారే ముఖ్యమంత్రి కేసీఆర్… చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్. తెలంగాణ ఏర్పడింది మొదలు…సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా నియమించినప్పటి నుంచి నేటి దాకా తమ నిర్ణయాల్లో ఎవరి ప్రమేయం లేకుండా చూసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి పోకడలతో పై స్థాయి ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మునిసిపల్, పంచాయతీ, రెవిన్యూ ఇలా అనేక చట్టాల రూపకల్పనలో సీఎం, సీఎస్ లు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చిన ఆలోచనలు మాత్రమే పరిగణనలోకి తీసుకుని .. ఇతరులను కనీసం సంప్రదించకుండా బిల్లులు రూపొందించడంపై ఉన్నత స్థాయి అదికారులు నొచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
కీలక పరిణామాలు…నిర్ణయాలు…
తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్రంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి . అనేక బిల్లులకు ఆమోదం లభించింది. కొత్త కొత్త చట్టాలు అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నో నిర్ణయాలను క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న నిబంధనలున్నాయి. అయితే ఆ మేరకు క్యాబినేట్ సమావేశం నిర్వహించి మమా అనిపించేస్తున్నారని వినికిడి. క్యాబినెట్ సమావేశానికి వెళ్ళే వరకు, అజెండా అంశాలను గోప్యంగా ఉంచి బిల్లు ఆమోదం పొందే వరకు తమకు కూడా తెలియనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రులు. ఏదైన శాఖలో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఆ శాఖ మంత్రితో చర్చించి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయాలు తీసుకునే వారు. మంత్రులు చెప్పే అంశాలను పరిశీలించి మార్పుచేర్పులు చేసి చట్టంగా రూపొందించే వారు . ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే భావనలో మంత్రులున్నారని కొందరనుకుంటున్నారు.
చీఫ్ సెక్రెటరీదీ అదే దారి…
ఇక చట్టాల రూపకల్పనలో కీలక మైన చీఫ్ సెక్రటరీ సైతం ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఏ చట్టం రూపొందించాలి.. ఏయే అంశాలు చేర్చాలి… ఏ యే అంశాలు తొలగించాలన్న దానిపై పూర్తిగా సీఎస్ దే తుది నిర్ణయం. అయితే వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సెక్రటీలకు ఇది మింగుడు పడటం లేదని సమాచారం. అన్ని నిర్ణయాలు సీఎస్పే తీసుకుంటే, ఇంక తమకు శాఖలు కేటాయింపు మాత్రం ఎందుకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణ వచ్చిన తరువాత అనేక చట్టాల్లోమార్పు వచ్చినా వాటిలో తమ ప్రమేయం ఏమీ లేదన్న భావన వారిలో ఉన్నట్టు కింది స్థాయి అధికారులు చెప్పుకుంటున్నారు.
డబుల్ యాక్షన్…ఏదీ ఇన్ఫర్మేషన్…
తెలంగాణలో ఆ ఇద్దరు వ్యక్తులే ద్విపాత్రాభినయం చేస్తూ… బిల్లుల తయారీ లో తోటివారి ఆలోచనలు పరిగణించకుండా, ఏకపక్షంగా నిర్ణయాలు మంత్రులు, అధికారులు తీసుకోవడంపై అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. ఏదో ఒక రోజు తమ అభిప్రాయాలు చెప్పుకునే సందర్భం వస్తుందన్న ఆశతో కాలం వెళ్లదీస్తున్నారు.











