రైతుకు పంట సాగు విషయంలో సమగ్ర సూచనలు తెలియజేయడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో పంటలకు ఉండే డిమాండ్ తదితర వివరాల గురించి రైతులకు ఈ వేదికల ద్వారా సూచనలు, సలహాలను తెలియజేస్తారు. తెలంగాణలోని 2601 క్లస్టర్లలో రైతువేదికలు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కోడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదికను ప్రారంభించనున్నారు. ఈ వేదిక ప్రారంభ కార్యక్రమం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరగనుంది.
పంటసాగుకు రైతులకు అనుకూలమైన నిర్ణయాలకు ఈ రైతు వేదికలు ఉపయోగపడతాయని మంత్రులు పేర్కొంటున్నారు. మార్కెట్‌లో ఎక్కువగా డిమాండ్ ఉన్న పంటలపై అధ్యయనం చేసి రైతులకు తగు సూచనలు చేస్తారు. రైతు తన కష్టానికి తగ్గ ధరను తనే నిర్ణయించుకునేందుకు రైతు సమితులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి రైతు వేదికలను తీసుకొస్తుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు పాల్గొంటున్నారు.
కేసీఆర్ షెడ్యూల్..
-బేగంపేట నుండి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో జనగామ జిల్లా కోడకండ్లకు వెళతారు.
-12 గంటలకు కోడకండ్ల గ్రామానికి చేరుకుంటారు.
-12.10 నిమిషాలకు కోడకండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతువేదిక భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు.
-12.20 నిమిషాలకు పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తారు.
-మండలంలోని రామవరం గ్రామంలో వైకుఠదామం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలిస్తారు.
-అనంతరం కోడకండ్ల గ్రామంలో 5వేల మంది రైతులతో కలిసి సీఎం మాట్లాడనున్నారు.
-సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.