(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
పట్టువదలని విక్రమార్కుడులా రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న అందోళన 300 రోజులు కు చేరుకుంది. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయాన్ని ప్రకటించిన నాటినుండి అమరావతి ప్రాంత రైతులు రాష్ట్ర రాజధాని అమరావతి. యధావిధిగా కొనసాగాలని కోరుతూ చేస్తున్న దీక్షలు, ఆందోళనలు. 300 రోజుకు చేరుకున్నాయి.
రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు గత 300 రోజులుగా మహిళలు, పిల్లలతో సహా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో ఇప్పటివరకు 90 మంది పైగా రైతులు అసువులు బాశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకుండా, రైతాంగం చేస్తున్న ఆందోళనను పట్టించుకోకుండా మిన్నకున్నది. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలను, రాజకీయపక్షా లను కలుఫుకుని అమరావతి జె.ఏ. సి.ముందుకు వెళుతోంది. తమ ఆందోళనలో భాగంగా జె.ఏ. సి.నాయకులు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి అక్కడ వివిధ రాజకీయ పార్టీల నాయకులను, కేంద్రమంత్రులను కలిసి అమరావతి ప్రాంత రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని విన్నవించి తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు. అంతేకాక తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టు ను సైతం ఆశ్రయించటం జరిగింది.
ఈ ఆందోళనలు 300 రోజులకు చేరుకున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ అమరావతి రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, కర్షక, వర్తక, వాణిజ్య సంఘాలు మరియు మహిళ, ప్రజాసంఘాలు మండలాల వారిగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు ఆదివారం నాడు చేపట్టనున్నారు. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం నాడు అమరావతి రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టనున్నారు.
అయితే వైసీపీ నాయకులు గాని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అమరావతి రైతులు ఆందోళనను ఎంతమాత్రం పట్టించుకోకుండా తానూ తలపెట్టిన మూడు రాజధానులు వైపే మొగ్గుచూపుతున్నారు. అంతేకాక వైసీపీ పార్టీనాయకులు మంత్రులు అమరావతి రైతులు చేస్తున్న దీక్షలను, ఆందోళనలను అవహేళన చేస్తూ రైతులను పైడ్ ఆర్టిస్టులు గా చిత్రీకరిస్తూ రైతాంగాన్ని రెచ్చేగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం నాడు అమరావతి పరిరక్షణ సమితి (జె.ఏ.సి.) ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.