(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా పార్వతీపురంలో స్థానికులు దేవుని కోసం ఒక చిన్న మండపం కట్టుకుంటామంటే వైసీపీ, బీజేపీ రాజకీయ రంగు పులమటం శోచనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పార్టీలు వ్యవహరించాలి తప్ప రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకోవడం సరికాదన్నారు.
పునః పరిశీలించాలి
పార్వతీపురంలోని ఎస్‌ఎన్‌ఎం నగర్‌లో నిర్మించనున్న వినాయక, ఆంజనేయస్వామి మండపాల కోసం స్థలాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ద్వారపురెడ్డి పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులను కలిసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఎన్‌ఎం నగర్‌లో మండపం నిర్మాణానికి మున్సిపల్ అధికారుల తొలుత అనుమతి ఇచ్చారని, తరువాత నిలుపుదల చేయాలని చెప్పారని తెలిపారు. దీనిపై మున్సిపల్ అధికారులు మరోసారి ఆలోచించాలని కోరినట్లు చెప్పారు.
చొరవ చూపాలి
ఈ మండపం నిర్మాణంలో వైసీపీ, బీజేపీ నాయకులు వ్యక్తిగత ప్రతిష్టకు పోయి ఒకరిపై, మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో పట్టణం రాజకీయంగా వేడెక్కింది. కొద్ది రోజుల క్రితం వరకు మిత్రులుగా ఉన్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ప్రస్తుత బీజేపీ నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఒకరికొకరు దుర్భాషలతో ‘నీ వెంత అంటే నీ వెంత’ అని ఫోనులో వాద ప్రతివాదనలు చేసుకుంటూ రచ్చకెక్కారు. అంతటితో ఆగకుండా వారి శ్రేణులనూ రెచ్చగొట్టి ఒకరిపై ఇంకొకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. వీరి పరిస్థితి ఎలావున్నా స్థానికుల సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అందువల్ల వెంటనే సమస్య పరిష్కారానికి రాజకీయ నాయకులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.











