(విశాఖపట్టణం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతల అక్రమాలపై చర్యలు తీసుకోవడం కన్నా భయపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడూ ఆసుపత్రుల పాలవుతారా! అని గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ దాడులకు పాల్పడుతోంది. గతంలో మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సర్జరీ చేసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఆగమేఘాలపై ఆయనను అరెస్టు చేసింది. కొన్ని వందల కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణం చేయించింది. ప్రస్తుతం విశాఖలోని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ లక్ష్యంగా… ఆయన ఇంటి ప్రహరీ కూల్చేందుకు ప్రయత్నించింది. ఈ వ్యవహారంలో అనేక వింతలు కనిపిస్తున్నాయి.
పాతికేళ్ల నాటి ఆక్రమణలను గుర్తించారట…!
అధికార పార్టీ నేతలు, ప్రభుత్వం మెప్పు పొందేందుకు అధికారులు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారు. పీలా గోవింద్ ఎమ్మెల్యేగా, పీలా శ్రీనివాస్ నగర అధ్యక్షుడుగా తెలుగుదేశం పార్టీ తరఫున సేవలందించారు. ప్రస్తుతం పీలా గోవింద్ కరోనా వైరస్ పాజిటివ్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఇదే అదనుగా భావించిన అధికారపక్షం గురువారం సాయంత్రం పెందుర్తి లోని పీలా గోవింద్ నివాసం వద్దకు సాయంత్రం ఆరు గంటల తర్వాత చేరుకొని.. ఇంటి ప్రహరీని ప్రభుత్వ స్థలంలో కట్టారని గుర్తించినట్టు సెలవిచ్చారు.
మార్కింగ్ కూడా చేశామని చెప్పారు. ఈ పంచాయతీ కాస్త రాత్రి 8 గంటల వరకు జరిగింది. ఆక్రమణ కు సంబంధించిన తగిన ఆధారాలు చూపించాలని మాజీ ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్ కోరారు. ముందుగా నోటీసు కూడా ఇవ్వాలని రాత్రిపూట వచ్చి తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మొత్తానికి ఆ సమయంలో స్థానికులు కూడా ఎదురు తిరగడంతో అధికారులు వెనుదిరిగారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.
సుమారు పాతికేళ్ళ క్రితం నిర్మించుకున్న ఇంటికి ఇప్పుడు అధికారులు రావడం ఏమిటని? ఎటువంటి ఆధారాలు చూపకుండా.. నోటీసులు ఇవ్వకుండా తొలగింపునకు ఉపక్రమించడం ఏంటని? ఇది కక్షపూరిత చర్య కాకుంటే మరి ఇంకేంటి అని ఆయన నిలదీశారు? ఒక పక్క ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే .. మరోపక్క ఆయన నివాసంపై తొలగింపునకు ఉపక్రమించడం వెనుక రాజకీయ కక్ష తప్ప మరొకటి లేదు అని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
రెవెన్యూ వర్గాలు ఏం చెబుతున్నాయంటే..?
అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కొంతమేర ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారట. ఈ విషయాన్ని 20 ఏళ్ల తర్వాత తెలుసుకున్న అధికారులు.. గురువారం సర్వే చేసి సుమారు ఆరు సెంట్లు మేరకు గడ్డ స్థలాన్ని ఆక్రమించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే చేసి మార్కింగ్ కూడా చేశామని అందుకే తొలగిస్తామని వెల్లడించారు.
టీడీపీలో ఉంటే ఇక అంతే…
తెలుగు దేశం పార్టీలో కొనసాగాలంటేనే హడలి పోయేలా నాయకులను ఒక్కొక్కరిగా వై ఎస్ ఆర్ సి పి టార్గెట్ చేస్తోంది. కరుడుగట్టిన పార్టీ వాదులనైనా తమ వైపునకు తిప్పుకోవడం ఎలా అన్న దానిపై.. పక్కా ప్లాన్ తో దూసుకుపోతోంది. టీడీపీలో ఉంటే ఇక మన పరిస్థితి అంతే.. అన్న భయాన్ని కలిగిస్తోంది.