ఆయన అధికార పార్టీ వైసీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే .. ఇంకో వ్యక్తి బీజేపి నాయకుడు .. వారిద్దరి మధ్య ఏమి జరిగిందో స్పష్టంగా తెలియదు. బీజేపీ నాయకునికి ఎమ్మెల్యే ఫోన్ చేసి ‘నాతో కాంట్రోవర్సీ పడకు .. నా సంగతి తెలీదు .. రేపు నేను వస్తాను .. నువ్వు ఎక్కడికి వస్తావో చెప్పు .. తన్ని తీసుకుపోతా’ అని బెదిరించినట్లు .. దానికి బదులుగా ఆ బీజేపీ నాయకుడు ‘నీవు ఎమ్మెల్యేవు అని మరచిపోతున్నావు .. ప్రతిపక్ష నాయకుడుతో ఎలా మాట్లాడాలో తెలుసుకో.. దేనికైనా సిద్ధమే .. ప్రాణం తప్పించి ఏది పోయినా ఫర్వాలేదు.. నువ్వు రా .. ఎలా తన్ని తీసుకుపోతావో నేనూ చూస్తాను’ అంటూ బదులిచ్చిన ఒక రికార్డెడ్ ఆడియో సోమవారం సాయంత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
వైసీపీ వెర్సెస్ బీజేపీ
విజయనగరం జిల్లా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పార్వతీపురం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన అలజంగి జోగారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జోగారావుకు మంచి మిత్రునిగా ఉంటూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్వతీపురం నుండి వైసీపీ గెలుపునకు తీవ్ర కృషి చేసిన ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఇటీవల ఆ పార్టీని విడిచి బీజేపీలో చేరారు. అక్కడ నుండి వీరి మధ్య అంతరం పెరుగుతూ వైసీపీ వెర్సెస్ బీజేపీగా మారింది.
సోషల్ మీడియా వేదికగా ..
వైసీపీ అధికారంలోకి వచ్చాక కేడర్‌ను పట్టించుకోవడం లేదని, ద్వితీయ శ్రేణి నాయకులకు కనీస ప్రాధాన్యత ఇవ్వడంలేదని గతంలోనూ సోషల్ మీడియా వేదికగా ద్వారపురెడ్డి ఆ పార్టీపైన అనేక ఆరోపణలు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే అలజంగి ఒంటెద్దు పోకడలతో వైసీపీ కేడర్ నిర్వీర్యం అవుతోందని, అందుకే తాను పార్టీ మారుతున్నట్లు కూడా తన అనుయాయులతో చెప్పినట్లు తెలిసింది.
ఏదేమైనా ఏడాదిన్నరగా వీరిద్దరి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న మన స్పర్థలు ఇలా బహిర్గతం అవ్వడంతో పరిస్థితి ఎటువైపు దారితీస్తుందనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.











