గుంటూరు అర్బన్ ఎస్పీ కి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
పొన్నూరు ఎమ్మెల్యే ని ఉద్దేశించి టీడీపీ కార్యకర్త మణిరత్నం పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్టు వివాదాస్పదం అయింది. దీనిపై అతణ్ని పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేశారంటూ నారా లోకేష్ ఒక ట్వీట్ చేశారు. పులివెందుల పిల్లి టీడీపీ కార్యకర్తలను చూసి భయపడుతోందని లోకేష్ పోస్ట్ చేశారు. సగం గోడ మాత్రమే కట్టినప్పటికీ ఎమ్మెల్యే భారీ ప్రారంభోత్సవం చెయ్యడమే సిగ్గుచేటు అని నారా లోకేష్ తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. దాని ప్రారంభోత్సవం పై సోషల్ మీడియా లో పోస్ట్ చేసినందుకు పొన్నూరులో టీడీపీ కార్యకర్త మణిరత్నాన్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చెయ్యడం జగన్ పిరికితనాన్ని బయటపెట్టిందని ట్విట్టర్ లో లోకేష్ పేర్కొన్నారు.
మణిరత్నం పెట్టిన పోస్ట్ లో తప్పేంటో అరెస్ట్ చేసిన పోలీసులు చెప్పాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు ఆడమన్నట్టు ఆడుతున్న కొంతమంది పోలీసులు ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేది ఏమీ ఉండక పోగా ప్రతిగా కష్టాలు కొనితెచ్చుకుంటారని లోకేష్ హెచ్చరించారు.
Also Read ;- గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి బాలయ్య, లోకేష్!
గుంటూరు అర్బన్ ఎస్పీ రియాక్షన్..
నారా లోకేష్ పెట్టిన పోస్టుపై గుంటూరు అర్బన్ ఎస్పీ స్పందించారు. అసత్య వార్తలు ప్రచారం చేస్తే లోకేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టి పోలీసులు హెచ్చరించారు. పోలీసుల చర్యలు ఎస్సీ సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయనే అసత్య ప్రచారం జరిగేలా లోకేష్ పోస్టు ఉన్నదని, అబద్ధాలను ప్రచారం చేయటంతో పాటు కలహాలను ప్రేరేపించేలా ఉన్నాయని ట్విట్టర్ లో గుంటూరు అర్బన్ ఎస్పీ పోస్ట్ చేశారు.
నారా వారు వదిలిపెడతారా?
గుంటూరు అర్బన్ ఎస్పీ పెట్టిన ట్వీట్ పై నారా లోకేష్ మరో ట్వీట్ పెట్టారు. గుంటూరు అర్బన్ ఎస్పీ కి దమ్ము, ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్ లో సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టాలని లోకేష్ సవాల్ విసిరారు. మణిరత్నం ఆ పోలీస్ స్టేషన్ వద్ద విడుదలైన ఫోటోను లోకేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పోలీసులు రాజకీయ ఉన్నతాధికారులకు వంగిపోవడం మానుకోవాలని గుంటూరు అర్బన్ ఎస్పీకి లోకేష్ ట్వీట్ పెట్టి సలహా కూడా ఇచ్చారు.
ఇలా గుంటూరు అర్బన్ ఎస్పీకి- నారా లోకేష్ కు మధ్య జరుగుతున్న ట్వీట్ల యుద్ధం జనానికి మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. వీరిద్దరి మధ్య సోషల్ మీడియా సమరాన్ని చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు.
Must Read ;- జడ్జిలపై ఆరోపణల కేసులో ప్రముఖులను తప్పించారా?