(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఏజెన్సీ ముఖ ద్వారంగా, ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నపార్వతీపురం వైసీపీ, బీజేపీ నాయకుల మాటల యుద్ధంతో రాజకీయంగా ఒక్కసారి వేడెక్కింది. కొద్ది రోజుల క్రితం వరకు మిత్రులుగా ఉన్న పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ప్రస్తుత బీజేపీ నాయకులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఒకరినొకరు దుర్భాషలతో ‘నీ వెంత అంటే.. నీ వెంత’ అని ఫోనులో వాద ప్రతివాదనలు చేసుకుంటూ రచ్చకెక్కారు. అంతటితో ఆగకుండా వారి శ్రేణులనూ రెచ్చగొట్టి ఒకరిపై ఇంకొకరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడంతో ఆ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది.
మండప నిర్మాణంతో ..
విజయనగరం జిల్లా పార్వతీపురం ఎస్‌ఎన్‌ఎం నగర్‌లో ఆ ప్రాంత వాసులు ఒక దాత విరాళంగా ఇచ్చిన కొద్దిపాటి స్థలంలో మండపం నిర్మించుకుని వినాయకుని విగ్రహం ప్రతిష్ట చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు దానికి అభ్యంతరం చెప్పినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు ద్వారపురెడ్డి ఆ నిర్మాణం దగ్గరకు వెళ్లి పరిశీలించినట్లు తెలిసింది. విషయాన్ని తన అనుచరుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే వెనువెంటనే ద్వారపురెడ్డికి ఫోన్ చేసి కంట్రోవర్సీ చేయొద్దనడంతో ఇరువురి మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది.
ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదకరం
ఆలయ మండపం నిర్మాణ పరిశీలనకు వెళ్లిన తమ నాయకునికి ఫోను చేసి దుర్భాషలాడారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే జోగారావుపై పార్వతీపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు పి.వేణుగోపాలం, నిమ్మక జయరాజ్ మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడు డి.శ్రీనివాసరావు నిర్మాణం పరిశీలించేందుకు వెళ్లగా ఎమ్మెల్యే అతనిపై అనుచితంగా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలకే ప్రమాదకరమన్నారు.
అనుచిత వ్యాఖ్యలు సరికాదు
వైసీపీ నాయకులు కె.బాలకృష్ణ, ఎం.రవికుమార్, జె.శ్రీదేవి మాట్లాడుతూ బీజేపీ నాయకుడు శ్రీనివాసరావు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది సరికాదని అన్నారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయనగరం జిల్లాలో రాజకీయ కక్షలకు దూరంగా, ప్రశాంతంగా ఉండే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన పార్వతీపురం ఒకేసారి అటువంటి వాటికి చోటివ్వడం వల్ల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- వైఎస్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు











