గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ చూస్తుంటే.. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక పాత బస్తీలో తన సత్తా నిరూపించుకునేందుకు ఎంఐఎం సైతం మాటల తూటాలు పేలుస్తోంది. ఆ పార్టీ ముఖ్యనేతలు అక్బర్, అసదుద్దీన్ ఓవైసీలు చేస్తున్న ప్రకటనలకు బీజేపీ ధీటుగా స్పందిస్తోంది.. ఆ పార్టీనే తమకు ప్రత్యర్థి అంటూ బీజేపీ కూడా ప్రకటించింది. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎంలను ధీటుగా ఎదుర్కొంటూ ప్రచారాన్ని ఉర్రూతలూగిస్తోంది బీజేపీ. ఓవైపు దూకుడు పెంచుతూనే మరోవైపు ఓటర్లను తమ వైపు తెచ్చుకునేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోంది.
ఎంఐఎంపైనే మాటల దాడులు
ఎంఐఎంను అడ్డుపెట్టుకుని హిందువుల ఓట్లు గంప గుత్తగా లాగుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రచారంలో టీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఎంఐఎంపైనే మాటల దాడులు చేస్తోంది బీజేపీ. ఆ పార్టీ నేతలు సైతం అసద్ బ్రదర్స్‌ను అటాక్ చేసేందుకు ఎంత వరకైనా వెళ్ళేందుకు సిద్దమౌతున్నారు. రోహింగ్యాలను తరిమి కొడతామన్నా.. ఎంఐఎంను నగరం నుండి గెంటివేస్తామని హెచ్చరించినా.. ఇలా రోజుకో మాటతో తూటాలు పేలుస్తున్నారు. దీంతో ఎంఐఎం వర్సెస్ బీజేపీగా ప్రచారం టర్న్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఏ చిన్న విమర్శ చేసినా అసద్ సోదరులు సీన్‌లోకి వస్తున్నారు. అసద్ సోదరులు ఏ చిన్న ప్రకటన చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొత్తం విరుచుకు పడుతోంది. దీంతో ఆ రెండు పార్టీల నేతలు ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నారు. ఇక కేటీఆర్ ఇరు పార్టీలకు కౌంటర్లు ఇస్తూ తాము కూడా రేసులో ఉన్నామంటూ గుర్తు చేస్తున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఇక బీజేపీ తాజా స్టెప్ ఆ పార్టీకి మరింత బలం పెంచింది. హుస్సేన్‌సాగర్ కబ్జా చేస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల్లో ఉన్నదాన్ని ఇప్పుడు వందలోపు ఎకరాలకే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. హుస్సేన్‌సాగర్‌లో స్థలంలో ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్‌లు నిర్మించారని … కేసీఆర్‌కు వాటిని కూల్చివేసే దమ్ముందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో బండి సంజయ్ రంగంలోకి దిగి ఎంఐఎంను కడిగి పారేశారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను కూల్చి వేస్తారా… కూల్చి వేస్తే రెండు గంటల్లో దారుస్సలాం కూల్చి వేస్తానంటూ హెచ్చరించారు. దీంతో అటు టీడీపీ, ఇటు పీవీ అభిమానుల మనసులు చూరగొన్నారు బండి సంజయ్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అన్ని అవకాశాలను ఆయన తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఓ వర్గం వారు , ఇతర పార్టీల ఓట్లను కూడా తన వైపు తిప్పుకోవడంలో కూడా సంజయ్ ఫుల్ సక్సెస్ అయ్యారని.. ఇక తమ గెలుపు ఖాయం అంటున్నారు బీజేపీ పార్టీ నేతలు.
Also Read: జగన్ సారూ.. జరంత కేసీఆర్‌ను చూడరూ