దేశంలోని 30 జిల్లాల్లో కరోనా చాలా తీవ్రంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 7 జిల్లాలు ఏపీలో ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో ఇప్పటికే కోటి 74 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. వీరిలో కోటి 30 లక్షల మంది కోలుకోగా, మరో 34 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. కొత్తగా రోజుకు నాలుగు లక్షల మందికిపైగా కరోనా భారిన పడుతుంటే, కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య 3 లక్షలు దాటడం లేదు. దీంతో పలు రాష్ట్రాల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పలు దేశాల నుంచి ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు దిగుమతి చేసుకుంటోంది. అయితే అవన్నీ ఆసుపత్రులకు చేరడానికి మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.
ఆక్సిజన్ అందడం లేదు
దేశంలో దాదాపు 2 లక్షల మంది కరోనా రోగులకు ఆక్సిజన్ అందిస్తూ వైద్యం చేయాల్సి వస్తోంది. దీంతో ప్రతి రోజూ దేశంలో 20 వేల టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది. అయితే దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తి 17 వేల టన్నులు మించడం లేదు. దీంతో సింగపూర్, భూటాన్, బహరైన్, సౌదీ అరేబియా దేశాల నుంచి కూడా ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కూడా ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండరు పంపించాయి. వాటిని గమ్యస్థానాలకు చేర్చి వినియోగించుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక దేశంలో ఆక్సిజన్ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రులు, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందిస్తోంది. వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు మరో పది రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వేగాన్ని అదుపు చేయకుంటే రాబోయే కొద్ది రోజుల్లో కరోనా కన్నా, ఆక్సిజన్ అందక ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగురాష్ట్రాల్లో కోవిడ్ విలయం
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం రేపుతోంది. ఏపీలో నిన్న ఒక్క రోజే 22 వేల మంది కరోనా భారిన పడ్డారు. దీంతో ఏపీలో కరోనా భారిన పడిన వారి సంఖ్య 12 లక్షలకు చేరుకుంది. వీరిలో 10 లక్షల మంది కోలుకున్నారని అధికారులు ప్రకటించారు. మరో 2 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క కరోనా రోగులు నానా అవస్థలు పడుతున్నారు. కరోనా రికవరీతో ఇంటికి చేరే వారికంటే, కొత్తగా కరోనా భారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో వారికి బెడ్లు కేటాయించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. కరోనా రోగులకు 3 గంటల్లో బెడ్లు కేటాయించాలని సీఎం జగన్ ఆదేశించినా, క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు దొరక్క రోగులు చెట్ల కింద పడిగాపులు పడుతున్నారు. ఇక తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే తెలంగాణలో 7 వేల మంది కరోనా భారిన పడ్డారు. దీంతో తెలంగాణాలో కరోనా యాక్టివ్ కేసులు లక్షా 50 వేలకు చేరాయి. కరోనా రోగులకు బెడ్లు, ఆక్సిజన్ కొరత లేదని తెలంగాణ సీఎస్ ప్రకటించారు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.
రెండో డోసు మాత్రమే..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా టీకా కేంద్రాల వద్ద అలజడి నెలకొంది. 45 సంవత్సరాలు నిండి, రెండో టీకా వేయించుకునే వారికే టీకా వేస్తున్నామని అధికారులు ప్రకటించారు. దీంతో జనం కరోనా టీకా కేంద్రాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. మొదటి డోసు తీసుకుని రెండో డోసుకోసం తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 22 లక్షల కరోనా టీకాలు పంపింది. వాటిని 45 సంవత్సరాలు దాటి, రెండో డోసు తీసుకుంటున్న వారికే వేస్తున్నారు. దీంతో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆందోళనకు దిగుతున్నారు.
థర్డ్ వేవ్ తప్పదా?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. ఇక సెకండ్ వేవ్ ఎప్పుడు ముగుస్తుందో కూడా ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. అయితే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని కేంద్ర సాంకేతిక సలహాదారు ప్రకటించారు. దీంతో దేశంలో మరోసారి కరోనా విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందనే వార్తలతో జనం టీకాల కోసం ఎగబడుతున్నారు. టీకాల సరఫరా కూడా సరిగా లేకపోవడంతో ఒక్కో కేంద్రంలో 50 మందికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. టీకా కేంద్రాలకు వందల సంఖ్యలో జనం క్యూ కడుతుంటే, 50 మందికి టీకా వేసి మందు అయిపోయిందని చెబుతున్నారు. దీంతో టీకా కేంద్రాల వద్ద పోలీసులను మోహరించాల్సి వస్తోంది. ఏది ఏమైనా కరోనా విలయం నుంచి పాలకులు పాఠాలు నేర్చుకుంటారా? లేదా? వేచిచూడాల్సిందే….