గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని హాయ్ లాండ్ లో కరోనా రోగులకు రహస్యంగా చికిత్స నిర్వహిస్తున్న బాగోతం బయట పడింది. ఎన్ ఆర్ ఐ ఆసుపత్రికి చెందిన ఓ డాక్టరు హాయ్ లాండ్ లో హోటల్ అద్దెకు తీసుకుని కరోనా రోగులకు రహస్యంగా చికిత్స అందిస్తోన్నట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. ఒక్కో రోగి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్టు సమాచారం.
పోలీసులు దాడులు చేస్తున్నారనే సమాచారం రాగానే సోమవారం సాయంత్రం కొందరు రోగులు, డాక్టర్లు, సిబ్బంది పరారయ్యారు. గదుల్లోనే ఉండిపోయిన ఏడుగురు రోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేంద్రం ఎవరు నిర్వహిస్తున్నారనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.
క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారా?
విజయవాడ నగరంలోని స్వర్ణా ప్యాలెస్ లో అనుమతులు తీసుకుని కరోనా కేంద్రం నడిపితేనే రచ్చ చేసిన అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా హాయ్ లాండ్ లో రహస్యంగా కరోనా చికిత్స కేంద్రం నిర్వహిస్తున్నారంటే వారికి ఎవరినుంచి అండదండలు ఉన్నాయనే అనుమానాలు వస్తున్నాయి. అంతేకాదు కొత్తగా తయారు చేసిన మందులను రహస్యంగా రోగులపై ప్రయోగించి క్లినికల్ ట్రయల్సు నిర్వహిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై సీరియస్ గా తీసుకున్న గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్, హాయ్ లాండ్ ఘటనపై లోతుగా విచారణ జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
రహస్యం ఎందుకు?
గుంటూరు, విజయవాడ పరిధిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నారు. అటు గుంటూరు జీజీహెచ్, విజయవాడలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలోనే 2000 మందికి కరోనా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక గుంటూరు, నరసరావుపేట, విజయవాడ నగరాల్లో ప్రయివేటు ఆసుపత్రుల్లో కూడా అనధికారికంగా కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మంగళగిరి సమీపంలోని హాయ్ లాండ్ లో రహస్యంగా కరోనా రోగులకు చికిత్స అందించడంపై వామపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం కరోనా రోగులకు చికిత్స అందించడంలో విఫలం కావడం వల్లే రోగులు ఎవరి దారి వారు చూసుకోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు.
కరోనా కట్టడి సాధ్యమేనా?
ఏపీలో కేవలం కరోనా టెస్టులు మాత్రమే నిర్వహించి వదిలేస్తున్నారు. హోం ఐసోలేషన్ కు రోగులను అనుమతిస్తున్నారు. కానీ వారికి కనీసం ఒక టాబ్లెట్ కూడా ఇవ్వడం లేదు. కనీసం ఫోనులో డాక్టర్ల సలహాలు కూడా అందడం లేదు. అందుకే ప్రయివేటు డాక్టర్లు రెచ్చిపోతున్నారు. ప్రజల ఆర్థిక స్థితినిబట్టి పలు ప్రయివేటు ఆసుపత్రులు కరోనా ట్రీట్మెంట్ ప్యాకేజీలు అనధికారికంగా ప్రకటించాయి.
విజయవాడలో కొంచె పేరున్న ఆసుపత్రులు కరోనా వైద్యానికి రూ.5 లక్షల ప్యాకేజీ ఫిక్సు చేశాయి. ఇక గుంటూరులో రూ. 4 లక్షలు, నరసరావుపేటలో మూడు రోజుల కరోనా వైద్యానికి రూ.40 వేలు ఫిక్సు చేశారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే ప్రయివేటు ఆసుపత్రులు, చివరకు ఆర్ ఎం పీ డాక్టర్లు కూడా చెలరేగిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.











