తెలుగు సినిమా రంగంలో ఆయన యశస్సు అసాధారణం. నటన అంటే ఆయనకు నల్లేరు మీద నడక. ఆయన డైలాగ్ చెబితే థియేటర్లు దద్దరిల్లి పోయేవి.
జగత్ జెంత్రీలు సినిమాలో అనుకుంటాను ఓ డైలాగ్ ఉంటుంది. ఎస్వీ రంగారావును బంధించి తీసుకొస్తే విలన్ ‘పులి బోనులో చిక్కిందే’ అంటాడు. అందుకు ఎస్వీ రంగారావు పలికిన డైలాగ్ ‘బోనులో ఉన్నా.. అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే’ అని. అదే డైలాగ్ వేరొకరు ఎవరు పలికినా అది తేలిపోతుంది. కానీ ఆ రోజుల్లో ఎస్వీ రంగారావు పలికిన ఆ డైలాగుకు థియేటర్ దద్దరిల్లి పోయింది. సోలో హీరోగా, మంచి తండ్రిగా, తాతగా, విలన్ గా, రావణాసురుడిగా.. ఇలా చెప్పుకుంటే పోతే ఎస్వీ రంగారావు చరిత్ర తరగదు. ఆయన చనిపోయాక విడుదలైన సినిమా ‘చక్రవాకం’. జులై 3 ఆయన జయంతి సందర్భంగా అసలు ఎస్వీఆర్ కెరీర్ గురించి ఓ లుక్కేద్దాం.
1918 జులై 3న కృష్ణాజిల్లా నూజివీడులో ఆయన పుట్టారు. తండ్రి ఎక్సైజ్ శాఖలో పనిచేసేవారు. ఆయనకు తరచూ బదిలీలు జరుగుతుండటంతో నాయనమ్మ వద్దే రంగారావు పెరిగారు. ఈమె మద్రాసుకు మకాం మార్చడంతో రంగారావు జీవితం కూడా మద్రాసుకు మారిపోయింది. అక్కిడి హైస్కూలోనే చదువు. తన 15వ ఏటనే మొదటిసారి నాటకంలో నటించారు. అదలా కంటిన్యూ అయ్యింది. ఎలాంటి నాటకం వేసినా చప్పట్లు మార్మోగేవి. కళాకారుడికి అంతకంటే బలం ఏంకావాలి. ఆటల్లోనూ రంగారావు మేటి.
నాటకాల నుంచి సినిమాల వైపు
1936 లో ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు లాంటి నటులను చూసి తానూ అలా కావాలనుకున్నారు. ఎక్కడ తెలుగు నాటకాలు జరిగినా అక్కడ వాలేవారు. ఎస్వీ రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం ఏమిటో తెలుసా?.. 1934లో విడుదలైన ‘లవకుశ’. మద్రాసు నుంచి ఆయన చదువు వైజాగ్ కు మారింది. ఇంటర్మీడియట్ విశాఖపట్నం, డిగ్రీ కాకినాడలో చదివారు. నటుడిగా మొదటి చిత్రం 1946లో వచ్చిన ‘వరూధిని’. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం ఎస్వీఆర్ బంధువే.
ఇందులో ఎస్వీఆర్ ప్రవరాఖ్యుడి వేషం వేశారు. ఆయన తొలి సినిమా పారితోషికం రూ.750. ఆ సినిమా సరిగా ఆడకపోవడం, వేరే వేషాలు రాకపోవడంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కూడా ఆయన నాటకాలు వదల్లేదు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దూర్వాసుడిగా వేషాలు వేశారు. అదే సమయంలో అతను వివాహం కూడా జరిగింది. ఆ తర్వాత బీఏ సుబ్బారావు దర్శకత్వంలో రూపొందే ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో అవకాశం వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్, ఎస్వీఆర్ కెరీర్ ఒకే సమయంలో ప్రారంభమైందనే చెప్పాలి.
ఎన్టీఆర్ కి కూడా పల్లెటూరి పిల్ల రెండో సినిమానే. ఎస్వీఆర్ కూ అంటే. ఎన్టీఆర్ తోపాటు ఎస్వీఆర్ ను ప్రోత్సహించిన ఘనత మాత్రం ఆ నాటి నటి కృష్ణవేణి గారికే దక్కుతుంది. అది కూడా బీఏ సుబ్బారావు చెప్పడం వల్లే సాధ్యమైంది. ఇక ఆ తర్వాత చెప్పేదేముంటుంది. పాతాళభైరవితో ఎస్వీఆర్ అంటే ఏమిటో ఆయనే నిరూపించుకున్నారు. తెలుగు అగ్రనటుల్లో పొడి అక్షరాల్లో పలికే పేరుల్లో మూడో పేరు ఎస్వీఆర్ దేనని అనాలి. ఎన్టీఆర్, ఏయన్నార్ అని ఎలా పిలిచేవారో ఎస్వీఆర్ అని రంగారావును కూడా పిలిచేవారు.
ఆయన గుండెపోటుతో మరణించారు. చనిపోయి నాలుగు దశాబ్దాలు గడిచినా తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఎవరంటే ఎస్వీఆరే. ‘సాహసం సేయారా డింభకా.. రాజకుమారి సిద్ధించును’ అన్న నేపాళీ మాంత్రికుడు ఈ ఆజానుబాహుడే. ఆయన పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. ఈ మహానటుడి భారీ విగ్రహం ఏలూరులో ఏర్పాటుకావడం కూడా విశేషం. చార్లీ చాప్లిన్ మెచ్చిన నటుడు మనకు నచ్చిన మన ఎస్వీఆరే. ఆయన నటన అజరామరం.