టాలీవుడ్ స్టార్ హీరోల్లో బ్రహ్మాండమైన బిజినెస్ మైండ్ కలిగింది ఎవరయ్యా అంటే.. అందరూ ముక్త కంఠంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెబుతారు. తండ్రి కృష్ణ నట వారసత్వం తో పాటు ఆయన కార్య దక్షతను, వ్యాపార సూత్రాల్ని కూడా బాగానే ఒంట పట్టించుకున్నాడు. కేవలం హీరోగా నటించడమే కాకుండా.. బ్రాండింగ్ లోనూ, మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్వహణలోనూ, వెబ్ సిరీస్ నిర్మాణంలోనూ సమర్ధవంతమైన పాత్ర పోషిస్తున్నాడు. దీనికి తోడు మహేష్ బాబు మరో అతి ముఖ్యమైన వ్యవహారాన్ని కూడా చాలా లాఘవంగా నిర్వహిస్తున్నాడు.
ప్రస్తుతం తను నటించే సినిమాలకు ఒన్ ఆఫ్ ది పార్టనర్స్ గా ఉంటున్నాడు. దీనివల్ల ఇటు లాభాల్లో వాటా తీసుకోవడం, అటు నిర్మాతలకు సాయంగా నిలబడడం .. రెండూ జరుగుతాయి. దీని వల్ల అతడు హీరోగా నటించే భారీ ప్రాజెక్టులు అత్యధిక రేట్లతో అమ్ముడుపోతున్నాయి. ‘శ్రీమంతుడు’ సినిమా నుంచి మహేశ్ బాబు ఈ పద్ధతికి శ్రీకారం చుట్టాడు. దీంతో ఆ సినిమా ఏరియా హక్కులు, శాటిలైట్ రైట్స్ , అనువాద హక్కులు అతడి ఖాతాలో పడుతున్నాయి. పారితోషికం అందుకోవడం కన్నా ఇదే బెస్ట్ అని మహేష్ భావిస్తున్నాడు.
‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత మహేశ్ బాబు నటించిన అన్ని సినిమాలకు అతడు ఇలాగే లాభాల్లో వాటాలు అందుకున్నాడు. ఇప్పుడు మహేశ్ బాబు నటిస్తోన్న ‘సర్కార్ వారి పాట’ సినిమా విషయంలో కూడా మహేశ్ బాబు ఈ విధానాన్నే ఫాలో అవుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా లాక్ డౌన్ లోనే అనౌన్స్ మెంట్ జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ‘సర్కార్ వారి పాట’ మూవీకి మహేష్ బాబు ఒన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. షూటింగ్ కూడా ఇంకా ప్రారంభం కాని ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ సహా శాటిలైట్ రైట్స్ ను అమ్మేశారని, దీనికి 35 కోట్లు భారీ ఆఫర్ ను ఒక ప్రముఖ సంస్థ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక హిందీ అనువాద హక్కులు మాత్రమే బాకీ అట. ఇలా రీలీజ్ కు ముందే ఈ సినిమాకి సంబంధించిన అన్ని రైట్స్ ను అమ్మేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. బ్యాంకింగ్ రంగంలో జరిగిన ఒక అతి పెద్ద స్కామ్ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలొస్తున్నాయి. మరి ఈ సినిమాతో మహేశ్ ను ఏ రేంజ్ లో లాభాలు ముంచెత్తుతాయో చూడాలి.











