ఇప్పడు తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నికలు, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల హడావుడీ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉన్నప్పటికినీ ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల వేడీ మాత్రం తెలంగాణ రాష్ట్రానికి తాకింది. ప్రధాన పార్టీలైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్), కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసి, వారిని గెలిపించుకోవడానికి స్ట్రాటజీలతో ముందుకు వెళుతున్నాయి. అధికారపార్టీ అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులను శంఖుస్తాపనలు చేసుకుంటూ వెళ్తోంది.మరోపక్క కేటిఆర్ అయితే తమ పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించి వారికి ఎన్నికలకు దిశానిర్ధేశం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రధాన పార్టీల అభ్యర్థులకు చిన్నాచితకా పార్టీలు ఎసరు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిపిఐ కూడా రెడీ అవుతోంది. ఈమేరకు సిపిఐ పార్టీ కార్యదర్శి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను రెండు స్థానాల్లో బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పలువురు అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. జర్నలిస్టుల పేర్లను, గెలిచే అవకాశం ఉన్న వ్యక్తుల పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నది. అలాగే కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి సిపిఐ మద్దతును కూడా కోరబోతోంది. త్వరలోనే కాంగ్రెస్ ఛీఫ్ ను పార్టీ నయాకత్వం కలవబోతున్నట్లు తెలిసింది.
సిపిఐ పోటీతో ఎవరికి లాభం?
రెండు స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తే అది టిఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ నేత పళ్ల రాజేశ్వరెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి బిజెపి నేత రాంచందర్ రావులు ఎమ్మెల్సీలుగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినథ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో పోటీ చేసే అంశంపై వివిధ పార్టీలు తమ అభిప్రాయాలను ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల బరిలో టిఆర్ఎస్, టిజెఎస్, బిజెపి బరిలో దిగుతున్నట్లు ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రకటించాయి. కాంగ్రెస్ తమ వైఖరినీ ఇంకా స్పష్టం చేయలేదు. తాజాగా తాము కూడా బరిలో ఉండబోతున్నట్లు సంకేతాలను సిపిఐ చెప్తుంది. 2019 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిజెఎస్, కాంగ్రెస్, టిడిపి, సిపిఐ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టిజెఎస్, సిపిఐ వేరువేరుగా పోటీచేస్తూ త్రిముఖ పోరు ఉంటే అది అధికార పార్టీకి బాగా కలిసి వచ్చి టిఆర్ఎస్ గెలిచే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఓట్లు చీలిపోయి అధికార పార్టికి మేలు చేసినట్లవుతోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం పక్కనబెడితే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గం నుండి టిజెఎస్ అధ్యక్షులు కోదండరామ్ పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా తనకి ఎక్కువగానే ఉన్నాయి. అయితే తనగెలుపు కోసం ఆయన మహాకూటమి మిత్రపక్షాలైన కాంగ్రెస్, టిడిపి, సిపిఐ మద్దతు తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు సిపిఐ కూడా ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితిలో టిజెఎస్ వంతైంది. ఒకవేళ సిపిఐ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అది టిఆర్ఎస్ కే లాభం చేకూరనుందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రుల స్థానంలో ప్రధాన పోటీ టిఆర్ఎస్, బిజెపి మధ్య పోటీ ఉండనుంది.ఇక్కడ కూడా సిపిఐ తన అభ్యర్థిని బరిలో దింపేతే అధికారపార్టీకే కలిసొచ్చే అంశమవుతోంది.
మరోపక్క నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ ఎన్నికల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. పోటీ చేయడమే కాదు టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఈ సారీ తమ కైవసం చేసుకోవాలని ఆయన గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఇప్పటికే ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల తమ పార్టీ నాయకులతోపాటూ విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్, సిపిఎం, టిడిపి పార్టీల మద్దతు ఇచ్చే విషయంపై ఆయన ఆయా పార్టీల నాయకులతో టచ్ లో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.











