పవన్ కల్యాణ్… పవర్ స్టార్. అంటే ఆయన పవర్ లోకి రాకపోయినా ఏదో ఒక పార్టీని పవర్ లోకి తీసుకువచ్చే పవర్ స్టార్ అని అటు తెలుగుదేశం, ఇటు భారతీయజనతా పార్టీ రెండూ నమ్మాయి. తెలుగుదేశం పార్టీ విషయంలో అది నిజమైనా… భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం అది ఇంకా రుజువు కాలేదు. ఆయన్ని నమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఓ కులం తమ వెంట ఉన్నట్లేనని కమలనాథులు సంబరపడ్డారు. అందుకే వారిని పాచిపోయిన లడ్డూలనో, మరొకటనో అన్నా,,, నవ్వేని పవన్ తో జతకట్టారు.
అయితే ఆ జత ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైపోయిందంటున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణా నాయకులు. కమలనాథులతో కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ తెలంగాణా భారతీయ జనతా పార్టీ నాయకులతో ఒక్కటంటే ఒక్కసారి కూడా కలవలేదు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లలేదు. ఆయన దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ వైపే ఉందంటున్నారు. కమలనాథులు, పవన్ కల్యాణ్ కలిసి దాదాపే ఏడాది కావస్తోంది.
ఈ ఏడాది కాలంలో ఓ పదిసార్లు ఆంధ్రప్రదేశ్ కమలనాథులతో కలిపి విలేకరుల సమావేశాల్లోనూ, వివిధ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు పవన్ కల్యాణ్. తెలంగాణా విషయంలో మాత్రం ఆయన ఎందుకో తొంగి చూసి వంగి వాలడం లేదు. తెలంగాణా కమలనాథులు కూడా పవన్ కల్యాణ్ ను పట్టించుకోవడం లేదంటున్నారు.
“బండి”కి పడదా…!?
పవర్ స్టార్ అంటే బీజేపీ నూతన అధ్యక్షుడు బండి సంజయ్ కు పడదని పార్టీలో ఓ వర్గం వారు అంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన బండి సంజయ్ సినిమా వాళ్లకి దూరంగా ఉంటారని, సినిమా మనుషుల్లో ఎన్టీఆర్ మినహా వెరెవ్వరికీ ఓట్లు రాబట్టే సీన్ లేదని అధ్యక్షుడు బండి సంజయ్ నమ్మకమని అంటున్నారు.
దీనికి అనేకానేక ఉదాహరణలు చూపించారని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఓటమి పాలవడం, గత ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం వంటివి తెర మీదకు తీసుకువస్తున్నారని చెబుతున్నారు. అలాగే, గతంలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన సినీ పరిశ్రమకు చెందిన వారు ఓటమి పాలైన విషయాన్ని కూడా బండి సంజయ్ ప్రస్తావిస్తారని అంటున్నారు. ఈ కారణాలతోనే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పట్ల విముఖంగా ఉంటారని చెబుతున్నారు.
కేసీఆరే వణుకా…!
ఇక పవన్ కల్యాణ్ వైపు నుంచి తెలంగాణా పట్ల ఆయన తొలి నుంచి కాసింత జాగ్రత్తగానే ఉంటున్నారని చెబుతున్నారు. తెలంగాణాలో పవన్ కల్యాణ్ కు అభిమానులు ఎక్కువ మందే ఉన్నారని, ఆయన పవనిజం పట్ల వారంతా ఆకర్షితులవుతారని చెబుతున్నారు. ఇన్ని ఉన్నా పవన్ కల్యాణ్ మాత్రం తెలంగాణాలో నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటే కాసింత భయమని రాజకీయ పరిశీలకు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కువ తక్కువగా ఏమైనా మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పుతారని, దాంతో పవన్ కల్యాణ్ రోడ్డున పడతారనే భయం ఉందని చెబుతున్నారు.
పైగా తొలి నుంచి కేసీఆర్ ను ఉద్యమ నాయకుడిగానే చూసిన పవన్ కల్యాణ్ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే దైర్యం చేయరని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో బారతీయ జనతా పార్టీతో తెలంగాణాలో కలిసి పని చేసే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. మొత్తానికి పవనిజం తెలంగాణా ఏమాత్రం ప్రభావం చూపదనేది నూటికి నూరు పాళ్లు నిజం అంటున్నారు.











