ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అనే సామెత చందంగా జిల్లాల పునర్విభజనతో తీవ్ర నష్టానికి గురికానున్న శ్రీకాకుళం జిల్లాకు బిసి కార్పొరేషన్ల పదవుల పందేరంలో రాష్ట్రంలోని ఏ జిల్లాకూ ఇవ్వనంత ప్రాధాన్యం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాకు ఇచ్చింది. ఈ ఒక్క జిల్లా నుండే ఆరుగురికి కార్పొరేషన్ చైర్మన్లగా ఎంపిక చేసింది. అంతేకాకుండా విజయనగరం కోటాలోనూ సిక్కోలు వాసికి వేరొక ఛైర్మన్ గిరి ముట్టజెప్పింది. దీన్ని సవతి తల్లి ప్రేమగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినట్టు జిల్లాల పునర్విభజన జరిగితే సిక్కోలు తల, కాలు లేని మొండెంగా మిగులుతుందని, ఆ పరిస్థితుల్లో అధికారపక్షనాయకులు నోరు మెదపకుండా ఉండేందుకు పదవుల పందేరంతో పెదవులు మెదపకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదని విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయనగరం కోటాలోనూ సిక్కోలు వాసికి పదవి
రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీకాకుళంపై ప్రేమ ఎంత ఎక్కువైందంటే విజయనగరం కోటాలో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మామిడి శ్రీకాంత్ ను తూర్పు/గాజుల కాపు ఛైర్మన్‌గా నియమించింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఈయన 2011 వరకు శ్రీకాకుళం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేశారు. గత సాధారణ ఎన్నికల్లో శ్రీకాకుళం, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ విజయానికి కృషి చేశారు.
టీడీపీ పునాదులు పెకలించే లక్ష్యంతోనే ..
టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళంలో ఆ పార్టీ పునాదులను పెకలించే లక్ష్యంతోనే కార్పొరేషన్ పదవుల పందేరం జరిగినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో జగన్ వేవ్ బాగా వీచినప్పటికీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు టెక్కలి , ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడం వైసిపికి మింగుడు పడలేదు.
ఆ నేపధ్యంలో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేసే దిశగా ఛైర్మన్ల నియామకాలు జరిగాయి. అందులో భాగంగా శ్రీకాకుళం నుండి అంధవరపు సూరిబాబును కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్గా, టెక్కలి నియోజకవర్గం నందిగాం నుండి పేడాడ తిలక్ ను కళింగ కార్పొరేషన్ చైర్మన్ గా, ఇచ్చాపురం నుండి దుక్కి లోకేశ్వర రెడ్డిని రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.
నరసన్నపేట నుండి ముగ్గురికి అందలం
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ముగ్గురిని కార్పొరేషన్ చైర్మన్లుగా ఎంపిక చేసి వైసీపీని అక్కడ మరింత బలోపేతం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ నియోజకవర్గంలో కింజరాపు కుటుంబానికి ఉన్న పట్టును పటాపంచలు చేసే ప్రయత్నం జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నరసన్నపేట మండలం నరసింగిపల్లికి చెందిన వంగి కృష్ణవేణిని పోలినాటి వెలమ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా, నరసన్నపేట కు చెందిన చీపురు రాణిని శ్రీశయన కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా, నరసన్నపేట మండలం బొరిగివలసకు చెందిన రాజాపు హైమావతిని పొందర కార్పొరేషన్ చైర్ పర్సన్‌గా నియమించారు.
ఈ పదవుల పందేరం వైసీపీ వర్గాలలో ఆనందాన్ని కలుగజేస్తుండగా , టీడీపీ వర్గాలలో గుబులు సృష్టిస్తోంది. పదవుల పందేరం వెనుకనున్న వైసీపీ రాజకీయ సమీకరణాలు అంతటా చర్చనీయాంశమవుతున్నాయి.