మార్వెల్ హల్క్ అభిమానులు పండగ చేసుకునే వార్త ఇది. హల్క్ మళ్లీ జనం ముందుకు రానున్నాడు. ‘వరల్డ్ వార్ హల్క్’ పేరుతో ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. హల్క్ గా మార్క్ రూఫెలో కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సోలోగా హల్క్ ని చూడాలన్న కోరిక ఆయన అభిమానులకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికి అది నెరవేరనుంది. ఈ సినిమా 2023 ద్వితీయార్థంలోగానీ, 2024 ప్రథమార్థంలోగానీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే పేరుతో 2007లో వచ్చిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.
ఇది పూర్తిగా యాక్షన్ ప్యాక్ డ్ మూవీ. హల్క్ అనేవాడు సూపర్ హీరో. ఇల్యూమినాటి గ్రూప్ నుంచి అతను బహిష్కరణకు గురవుతాడు. దీనికి కారణమైన వారిపై పగతీర్చుకునేందుకు అతను మళ్లీ తిరిగివస్తాడు. మొదటి మార్కెల్ సోలో హల్క్ చిత్రం 2008లో ‘ది ఇన్క్రెడిబుల్ హల్క్’ పేరుతో వచ్చింది. ఇందులో హల్క్ పాత్రను ఎడ్వర్డ్ నార్టన్ పోషించాడు. ఆ తర్వత అతని స్థానంలో మార్క్ రుఫాలో గ్రీన్ జెయింట్గా నటించారు.
‘ది ఎవెంజర్స్’, ‘ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ‘థోర్: రాగ్నరోక్’, ‘ఎవెంజెస్: ఇన్ఫినిటీ వార్’, ‘ఎవెంజర్స్: ఎండ్‌గేమ్’ లోనూ హల్క్ గా అతనే కొనసాగాడు. అయితే అతన్ని సోలో హీరోగా ఇంతవరకూ ఎవరూ చూడలేదు. ఇప్పుడు ఆ అవకాశం వస్తోంది. ఇప్పుడు ఈ హక్కులు ఎవరి వద్ద ఉన్నాయి అన్నది పెద్ద ప్రశ్న. మార్వెల్ వద్ద ఉన్నాయా, యూనవర్శల్ వద్ద ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది.
ఎందుకంటే మొదట హల్క్ పంపిణీ హక్కులు యూనివర్శల్ వద్దనే ఉన్నాయి. అయితే హల్క్ పాత్ర మీద సినిమా తీయగలిగే సామర్థ్యం ఒక్క మార్వెల్ దగ్గర మాత్రమే ఉంది. ఈ హక్కులను యూనివర్శల్ స్టూడియోస్ నుంచి మార్వెల్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. ఎవరు చేసినా హల్క్ మాత్రం సోలో హీరోగా రావడం మాత్రం ఖాయం.