దర్శకుడు యోగి గుర్తున్నాడా? రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా చాలా తెలుగు, హిందీ సినిమాలకు కో డైరెక్టర్ గా పని చేశారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో రవితేజ, నమిత జంటగా ‘ఒక రాజు – ఒక రాణి’అనే సినిమా మొదటిసారి డైరెక్ట్ చేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస తో యోగి తనకి ఉన్న స్నేహం కొద్దీ ‘ఒక రాజు – ఒక రాణి’ సినిమాలో త్రివిక్రమ్ తో పాటలు రాయించారు.
త్రివిక్రమ్ పాటలు రాసిన ఏకైక సినిమా అదొక్కటే. ఆ సినిమా తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుని వెంకటేష్, అనుష్కలతో ‘చింతకాయల రవి’ అనే సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమా సక్సెస్ అయినా యోగికి కొంత కాలం గ్యాప్ వచ్చింది. రామ్ చరణ్ ముచ్చట పడి హిందీలో చేసిన జంజీర్ సినిమా తెలుగు వెర్షన్ తుపాన్ కి యోగి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉన్న నాగ శౌర్య ని యాక్షన్ హీరోగా చూపిస్తూ క్రైమ్ థ్రిల్లర్ ‘ జాదూగాడు ‘ తీశారు యోగి.
ప్రముఖ నటులు మురళీ మోహన్ , జయభేరి అధినేతల్లో ఒకరైన కిశోర్ కి బంధువు అయిన యోగి తర్వాత బిజినెస్ వ్యవహారాల్లో మునిగి పోయారు. కొంతకాలం గ్యాప్ తర్వాత సినిమా రంగంలోకి ఎంటరయ్యారు. సొంతంగా ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించి వెబ్ సిరీస్ ఒరిజినల్ వెబ్ ఫిలిమ్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన ఓ హిందీ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్ ప్లాటుఫారంలో వచ్చే ఏడాది ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం.