డిక్లరేషన్ మీద సంతకం పెట్టి, తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాలి అనే నిబంధన ఎందుకు పెట్టారు అనే ప్రశ్న ఇప్పుడు పుడుతోంది. కానీ.. అసలు చర్చ జరగాల్సింది ఏంటంటే.. తిరుమలలో ఎప్పటినుంచో ఉన్న డిక్లరేషన్ నిబంధన గురించి ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారు? అని. జగన్మోహన్ రెడ్డి సంతకం పెడతానన్నా సరే.. ఆయన పార్టీ నాయకులు, అటు టీటీడీ ఛైర్మన్ సంతకం పెట్టనిచ్చేలా లేరు. అంతగా గట్టిగా ప్రతి ఒక్కరూ వాదిస్తున్నారు. జగన్ డిక్లరేషన్ కు విముఖులు గనుకనే.. వారంతా ఆయన మనోభిప్రాయాన్ని తమ మాటల్లో బయటపెడుతున్నారని అనుకోవచ్చు.
అయితే జగన్ కు డిక్లరేషన్ మీద సంతకం అంటే ఎందుకంత విముఖత? ఇంతకూ ఆ డిక్లరేషన్ లో ఏముంటుంది?

ఇంతకూ ఇతర మతస్తులు తిరుమలకు వచ్చిన సందర్భాల్లో డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఎప్పటినుంచో తిరుమలలో పాటిస్తున్నారు. 1987 నాటి యాక్ట్ 30 ప్రకారం.. తిరుమల రూల్స్ లో 136వ నిబంధనగా.. తిరుమల ఆలయంలోకి ప్రవేశించే అన్యమతస్తులు ఈ డిక్లరేషన్ ను నింపాలి. 1990 జీవో నెంబర్ 311 ప్రకారం ఈ ఆదేశాలు చేశారు. ఇంతకూ ఈ డిక్లరేషన్ ఫారమ్ లో ఏం ఉంటుంది?
పేరు, చిరునామా, మొబైల్ నెంబరు, ఐడీ ప్రూఫ్ వంటి వివరాలు సాధారణంగా ఉంటాయి. ఇవి సాధారణంగా ఏ ఫారం ఫిల్ అప్ చేసినా ఉంటాయి. తిరుమలకు వచ్చే ఇతర మతాలకు చెందిన భక్తులు సంతకం చేయవలసిన భాగానికి పైన ఉండే పార్ట్ ఇదే.
I … …. … .. .. … belong to .. .. … .. .. .. .. (religion) however I have faith in Lord Venkateswara and reverence to him and to his worship.
I may be permitted to enter the temple and have darshan of the Lord.
అని ముద్రించి ఉంటుంది. దాన్ని నింపి కింద సంతకం చేయాలి.
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. వేంకటేశ్వరుని మీద, ఆయనను ఆరాధించడం మీద నాకు విశ్వాసం ఉంది. అనే వాక్యం ఒకటి ఉంటుంది. అసలు ఏ మతానికి చెందిన వారైనా సరే.. ఈ ఆలయంలోకి అడుగుపెడుతున్నారంటేనే దాని అర్థం.. వారికి తిరుమలేశుని మీద విశ్వాసం ఉన్నట్టే. దానిని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. నామమాత్రంగా ఆ మాట అక్కడ ఉన్నదే తప్ప ఎవరైనా గుడిదాకా వచ్చారంటే దేవుడి మీద విశ్వాసంతోనే. ఇకపోతే.. ఆ ఫారంలో ప్రత్యేకంగా నమోదు చేయాల్సింది.. ఆ వ్యక్తి యొక్క మతం గురించి మాత్రమే.
ఒకరి రాద్ధాంతం.. ఒకరి విముఖత.. ఇంతకీ ఎందుకు?
డిక్లరేషన్ మీద సంతకం గురించి అందరూ రాద్ధాంతం చేస్తున్నారు. కానీ.. అసలు డిక్లరేషన్ లో ఎవరైనా సరే.. కొత్తగా ఒప్పుకునే సంగతి ఏమిటి? వేంకటేశుడి మీద భక్తి వారి రాకలోనే కనిపిస్తోంది. ఇక కొత్తగా ఒప్పుకుంటున్నది వారి సొంత మతాన్ని. సంతకం పెట్టడానికి అభ్యంతరం అంటే.. తన సొంత మతాన్ని చెప్పుకోడానికి అభ్యంతరం ఉన్నట్టు, ఇష్టం లేనట్టు అవుతుందే తప్ప మరొకటి కాదు.
అంటే ఇక్కడ జగన్ డిక్లరేషన్ కు విముఖత చూపిస్తే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి. తాను పాటిస్తున్న మతం ‘క్రిస్టియానిటీ’ అని చెప్పుకోడాన్ని జగన్మోహన్ రెడ్డి అవమానంగా భావిస్తున్నారు. చెప్పుకోవడం ఆయనకు ఇష్టం లేదా? అనే సందేహం కలుగుతుంది.
తమ చర్య ప్రజల్లోకి ఎలాంటి సంకేతం పంపుతుందో.. నాయకులకు స్పష్టత ఉంటే.. దాన్ని బట్టి వాళ్లు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.











