‘ధమ్ మారో ధమ్…’ దేవానంద్ దర్శకనిర్మాతగా, హీరోగా తెరకెక్కిన హరే రామ… హరే కృష్ణ సినిమాలోని పాట ఇది. నటిగా జీనత్ అమన్ కు కూడా ఈ సినిమా ఓ మలుపు… ఈ పాట ఓ మెరుపు. ఇదంతా ఎందుకంటే సినిమా రంగంలో నేడున్న పరిస్థితులకు అద్దం పట్టే పాట ఇది. ఈ పాటకు 50 ఏళ్లు వచ్చేశాయి. ఆ సినిమా తర్వాత మరో నాలుగేళ్లకు మోహన్ బాబు నటుడిగా పరిచయమైన ‘స్వర్గం నరకం’ సినిమా వచ్చింది. అందులో కూడా ‘హరే రామా… హరే కృష్ణా’ అంటూ ఓ విభిన్నమైన పాట కూడా ఉంది.
‘ఆట ఆడేది పాట పాడేది అనుభవించేది మనమేరా…హరే రామ్… జీవితమంటే పైన లేదురా… కింద లేదురా… ఇక్కడే ఉందిరా ’ అని మోహన్ బాబు పాడినట్లుగానే ప్రపంచం నడుస్తోంది. ఇప్పుడు అలాంటి ప్రపంచాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పంచమకారాల గురించి మనకు తెలిసిందే… ఆ మకారాల మాటేమో గాని మూడు మకారాలు మాత్రం సినిమా రంగాన్ని శాసిస్తున్నాయి. మగువ, మందు, మాదక ద్రవ్యం…. ఈ మూడూ మరో ప్రపంచానికి దారులు చూపిస్తున్నాయి.

ఓ సినిమాలో రజనీ అన్నట్టు ‘సినిమా రంగాన్ని డ్రగ్స్ శాసిస్తున్నాయి… నటులు వాటిని పాటిస్తున్నారు’ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. రియా చెప్పిన చిట్టా నుంచి ఇంకా ఏఏ పేర్లు బయటికి రానున్నాయో చూడాలి. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయ పెద్దల దృష్టికి కూడా వెళ్లే ఉంటుంది. ఈ కేసుల నుంచి కొన్ని పేర్లను తప్పించే ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం కొండను మాత్రం తవ్వుతున్నారు… ఆ తర్వాత మాత్రం దొరికేది ఎలుకలే. డ్రగ్స్ విషయం బయటికి వచ్చాక సుశాంత్ మరణానికి సంబంధించిన అసలు విషయం కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది.
సీబీఐ దర్యాప్తు ఎలాగూ జరుగుతోంది కాబట్టి దీని మీద అంతకంటే ఏమీ చెప్పలేం. డ్రగ్స్ విషయానికి వస్తే మాత్రం రియా ఈ కేసులో కూరుకుపోయిందనే చెప్పాలి. ఆ మధ్య తెలుగు సినిమా రంగంలో అకున్ సబర్వాల్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు జరిపారు. సినీ ప్రముఖులు ఎందరినో విచారించారు. ఇప్పుడా కేసు ఏమైందో కూడా తెలియదు. తాజాగా రియా విప్పిన డ్రగ్స్ చిట్టాలో తెలుగు హీరోల పేర్లు కూడా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. అటు శాండల్ వుడ్, ఇటు టాలీవుడ్… లకు మాత్రం ఇది గడ్డుకాలమే.

అసలు తెలుగు నటులతో రియా బంధం ఇంతగా పెనవేసుకోడానికి డ్రగ్స్ మాత్రమే కారణమా? ఇంకా ఏమైనా ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. డ్రగ్స్ తమ ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతాయో తెలిసి కూడా వీటికి ఎందుకు చేరువవుతున్నారన్నది అంతుబట్టని ప్రశ్న. దర్యాప్తులో రియా ఏఏ పేర్లు అయితే చెప్పిందో వారందరికీ ఎన్సీబీ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ విషయంలో ఈరోజు బయటికి వచ్చిన కొత్త పేర్లలో ఎవరూ ఇంతవరకు గొంతువిప్పలేదు.
రియా చక్రవర్తి పట్ల అందరూ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టిన లక్ష్మీ మంచు కూడా ప్రస్తుతం నోరు విప్పటం లేదు. రియాతో ఆమెకు ఉన్న అనుబంధం మీద ఓ ప్రకటన చేస్తే ఆమె మీద అనుమానాలు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం ఎవరికి వారు భుజాలు తడుముకునే స్థితిలో ఉన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని సంచలనాత్మక విషయాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నవారికి ఇక మరణ మృదంగం వినిపించాల్సిందే.











