ఏ క్షణాన ఐపీఎల్-20ని ప్లాన్ చేశారో కానీ ఆ నాటి నుంచి ఈనాటి వరకు వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. మొదట స్వదేశీ ఉద్యమం నేపథ్యంలో స్పాన్సర్ గా వివో తప్పుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ వినబడ్డాయి. బీసీసీఐ మద్దతు ఇచ్చినా ఇండియా అభిమానులకు జడిసి వివో స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంది. డ్రీమ్-11 అనే గేమింగ్ కంపెనీ భారీ మొత్తంలో చెల్లించి ఈ సీజన్ కు స్పాన్సర్ షిప్ ను సొంతం చేసుకుంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై కూడా మొదలయింది. బెట్టింగ్ యాప్ కు హక్కులు ఎలా ఇచ్చారంటూ బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో డ్రీమ్-11లో కూడా చైనా కంపెనీకి చెందిన పెట్టుబడులు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
దుబాయ్ లో టోర్నీని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన బీసీసీఐ ప్రాంచైజీలను ఆ దేశానికి రమ్మని ఆదేశించింది. కరోనా నియమాలను తప్పక పాటించాలని బీసీసీఐ ఆయా జట్లకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా నియమాలతో అన్నీ జట్ల ఆటగాళ్లు క్వారంటైన్ లో వుంది ఇటీవలే బయో బబుల్ లోకి వచ్చారు. కానీ చాలా మంది ఆటగాళ్లు ఈ వైరస్ భారిన పడ్డారు. ఇప్పటికీ చాలా మంది క్వారంటైన్ లోనే ఉండవలసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితులలో ఐపీఎల్ ను నిర్వహించకపోతే బీసీసీఐకి వచ్చే నష్టమేంటనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి దూరమయ్యారు. సురేష్ రైనా, హర్భజన్ సింగ్, లసిత్ మలింగా లాంటి ఆటగాళ్లు ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. కీలకమైన ఆటగాళ్లు తప్పుకోవడంతో టోర్నీ కళ తప్పిదంటూ వార్తలు వినబడుతున్నాయి.
కానీ బీసీసీఐ మొండిగా టోర్నీని నిర్వహించేందుకు సమాయత్తమైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఇదే సమయంలో ఐపీఎల్ థీమ్ సాంగ్ ను విడుదల చేసింది. ‘ఆయాంగే హమ్ వాపస్’ పేరిట విడుదల చేసిన థీమ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రణవ్ అజయ్ రావు అనే రాపర్ సిద్ధం చేసిన ఈ సాంగ్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బీసీసీఐ ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ సమయంలో ప్రముఖ రాపర్ కృష్ణ కౌల్ చేసిన విమర్శలతో బీసీసీఐ ఆనందం ఆవిరైంది. “దేఖో కౌన్ ఆయా వాపస్” అనే తన సాంగ్ ను వాడుకొని ఐపీఎల్ థీమ్ సాంగ్ ను సిద్ధం చేశారని ఆరోపణలు చేశారు. వాడుకున్న పర్వాలేదు కానీ తనకు క్రెడిట్ కూడా ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు సంవత్సరాల కిందట కౌల్ విడుదల చేసిన “దేఖో కౌన్ ఆయా వాపస్” సాంగ్ తిరిగి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ పాటను చూసిన అభిమానులు #IPLANTHEMCOPIED అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేశారు. దీంతో ‘ఆయాంగే హమ్ వాపస్’ ఐపీఎల్ ట్యూన్ సిద్ధం చేసిన ప్రణవ్ కాపీ వార్తలను ఖండించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇంకా కాపీ వార్తలపై చర్చ జరుగుతూనే ఉంది. దీంతో బీసీసీఐ ఈ థీమ్ సాంగ్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.











