దుబ్బాక పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగనుంది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ కాస్త మందకోడిగా సాగుతోంది. ఇప్పుడిప్పుడి ఓటేసేందుకు ప్రజలు పోలింగ్ బూతులకు తరలి వెళ్తున్నారు. మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా అందులో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. అందులోనూ టీఆర్ఎస్, బీజేపీ ఇరు అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. దుబ్బాక ఎన్నికలను రాష్ట్రం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.
దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్‌రావు తన ఓటు హక్కును బొప్పాపూర్ కేంద్రంలో వినియోగించుకున్నారు. చిట్టాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ఓటు వేశారు. పోలింగ్ సరళి ప్రశాంతంగా జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక విషయంలో అధికార ప్రతిపక్షాలు హోరాహోరిగా ప్రచారం నిర్వహించాయి.
మొత్తం 23మంది అభ్యర్థులు పోటీకి దిగారు. అయితే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డూ ఆర్ డై అన్నట్లుగా ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించాయి. 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 98028 మంది పురుషులు, 100719 మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 5వేల సిబ్బందిని నియామకం చేశారు. 315 పోలింగ్ కేంద్రాలను 32 సెక్టార్లుగా విభజించారు. 89 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకుంటున్నారు. మాస్కు ఉంటెనే ఓటు వేసేలా ముందస్తు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం నుంచి పోలింగ్ ఊపందుకోనుంది. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈనెల 10న ఉప ఎన్నిక ఫలితం వెల్లడికానుంది. హోరాహోరిగా ప్రచారంతో దుబ్బాక ఉప ఎన్నిక అంశం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.