తన భూమిలో శ్మశాన వాటిక కట్టొద్దంటూ ఓ రైతు కుటుంబం అధికారులకు ప్రాధేయపడింది. ఎంతకూ వినపోయేసరికి ఆ రైతు తన చేతుల్లో పెట్రోల్ డబ్బాను పట్టుకుని ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. శ్మశానవాటిక స్థలం పరిశీలనకు వచ్చిన అధికారులను రైతు కుటుంబం ఇలా అడ్డుకుంది. తన స్థలంలో శ్మశాన వాటికి నిర్మిస్తే తాను ఆత్మహత్య చేసుకుని శవమై తేలుతానంటూ అడ్డుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పరిధిలోని నర్సాతండా పంచాయతీలో శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించడానికి బయ్యారం తహసీల్దార్ తరంగిణి వెళ్లారు. అయితే తమ పట్టాభూమిని సర్వేచేసి శ్మశాన వాటికకు ఉపయోగిస్తే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని అధికారి కాళ్లు మొక్కుతూ ప్రాధేయపడ్డారు.
దాదాపు 40 ఏళ్ల క్రితం బాధితులైన.. కోడి భిక్షం, కోడి సోమక్క.. జెన్నపురెడ్డి జనార్ధన్ రెడ్డి కుమారుడు మురళీధర్ రెడ్డి దగ్గర సర్వే నంబర్ 51లో గల 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో కొంత ఆడపిల్లలకు కట్నం కింద ఇచ్చారు. మిగిలిన భూమిలో వ్యవసాయంచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థలం కావాలని తమకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. తమ భూమివైపు అధికారులు ఎవ్వరూ రావొద్దని వేడుకుంటున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు భూమి ఇచ్చేందుకు రైతులు స్వతహాగా వారే ముందుకు వచ్చేలా చేయాలి కానీ తన భూమిని ఇవ్వనని చెబుతున్నా ఇలా ఇబ్బందులను గురిచేయడమేంటని అధికారుల తీరుపై స్థానిక ప్రజలు పెదవి విరుస్తున్నారు.