సినిమా రంగంలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండటంతో జనం థియేటర్లకు రావడానికి భయపడే వాతావరణం నెలకొంది. లాక్ డౌన్ లేకపోయినా ఈ పరిస్థితుల్లో సినిమాల విడుదలను వాయిదా వేయడం మినహా మరో మార్గం నిర్మాతలకు కనిపించడం లేదు. ఈ నెల 9న ‘వకీల్ సాబ్’ విడుదలైంది. కరోనా తీవ్రత ఉన్నా ఆ సినిమా కలెక్షన్ల మీద కరోనా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కాకపోతే ఈ వారం విడుదల కావలసిన సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. అందుకే పెద్ద సినిమాల విడుదలను వాయిదా వేయడానికే నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు.
వచ్చే వారం విడుదల కావాలసిన ‘టక్ జగదీష్’ కూడా వాయిదా పడిపోయింది. లేకుంటే ఈ నెల 23వ తేదీ టక్ జగదీష్ విడుదల కావలసి ఉండేది. ఈ వారం నాగచైతన్య, సాయిపల్లవిల ‘లవ్ స్టోరీ’ విడుదల కావాలి. కానీ ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడిపోయింది. ఏఎంబీ సినిమా మాల్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కరోనా ఉధృతి తగ్గాకే సినిమా విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తాజా సమాచారం ఏమిటంటే రానా, సాయిపల్లవిల ‘విరాటపర్వం’ కూడా వాయిదా పడింది.
90వ దశకంలో జరిగిన యధార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించారు. ఇందులో రానా కామ్రేడ్ `రవన్న` పాత్ర పోషించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఏప్రిల్ 30న విడుదల చేయాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. బ్లాక్ బస్టర్ గా మారిన ‘వకీల్ సాబ్’కు ఈ తాజా పరిణామాలు వరమనుకోవాలో, శాపం అనుకోవాలో అర్థం కావడం లేదు. పోటీగా బరిలో మరే సినిమా లేకపోవడం మంచిదేగానీ, సినిమాల విడుదలను వాయిదా వేయడం వల్ల జనంలో భయాందోళనలు నెలకొని జనం థియేటర్లకు వస్తారా అన్న కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. కాకపోతే ఇప్పటికే భారీ వసూళ్లను వకీల్ సాబ్ సాధించింది కాబట్టి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయిందని చెప్పాలి.
ఆర్జీవీ దెయ్యం, తేజ సజ్జా నటించిన ‘ఇష్క్’ సినిమాలు ఈ వారం, వచ్చే వారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఏటికి ఎదురీదడం ఆర్జీవి అలవాటే కాబట్టి ‘ఆర్జీవీ దెయ్యిం’ మాత్రం విడుదల కావడానికే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ఇక మేనెలలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ల ‘ఆచార్య’ విడుదల కూడా వాయిదా పడటానికే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. కాకపోతే నిర్మాతలు అధికారికంగా ఇంకా ఏ విషయం ప్రకటించలేదు. ఈ నెలాఖరులో విడుదల కావలసిన గోపీచంద్ సీటీమార్, మే 1న పాగల్, మే 14న విడుదల కావలసిన వెంకటేష్ ‘నారప్ప’ తదితర చిత్రాలన్నీ వాయిదా పడటానికే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది.
Must Read ;- కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా కంగానా సినిమా వాయిదా !