పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయారు. కరోనా సెకండ్ వేవ్ ను సైతం తోసిరాజని కలెక్షన్లలో ‘వకీల్ సాబ్’ దూసుకుపోతోంది. ఓ పక్క కరోనా, ఇంకో పక్క ప్రభుత్వ పరమైన ఇబ్బందులను అధిగమిస్తూ ‘వకీల్ సాబ్’ దూసుకుపోతున్నాడు. విడుదలైన ఐదు రోజుల్లోనే 83.92 కోట్ల వసూళ్లు సాధించింది. 92 శాతం రికవరీ సాధించింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల దిశగా పరుగులు పెడుతుండటం విశేషం. నైజాం, వెస్ట్, ఉత్తరాంధ్రలలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆరో రోజు కలెక్షన్లతో నెల్లూరు, సీడెడ్ లలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించబోతోంది. పంపిణీదార్లకు ఈ సినిమా లాభాల పంట పండించబోతోంది.
ఈ ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో రూ. 75. 77 కోట్ల వసూళ్లు సాధించింది. మొదటివారంలోనే ఈ సినిమా వంద కోట్లు వసూలు చేయబోతోంది. ఈ ఏడాది ఇంత వసూళ్లు సాధించిన తొలి సినిమాగా రికార్డులకెక్కబోతోంది. కరోనా తర్వాత రెండు మూడు సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేసినా ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉంది కదా అని నిర్మాతలు వెనక్కి పోకుండా సినిమా విడుదల చేయడమే మంచిదైంది. లేకుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.
ప్రత్యేకమైన షోలకు అనుమతి వచ్చి ఉంటే ఈ కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండేవో చెప్పలేం. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ 38 రోజుల్లో 73. 38 కోట్ల షేర్ సాధించింది. ఈ ఏడాది ఇప్పటిదాకా విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’కు మాత్రమే ఉంది. దాన్ని ఇప్పుడు ‘వకీల్ సాబ్’ అధిగమించింది. ఉప్పెన సినిమా రెండు వారాల్లో 75.3 కోట్ల గ్రాస్, 48.14 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సాధించిన రికార్డును ఇంకెవరు అధిగమించనున్నారో చూడాలి.
తొలిరోజు కొంత డివైడ్ టాక్ ను తెచ్చుకున్న ‘వకీల్ సాబ్’ ఇప్పుడు బ్లాక్ బస్టర్ జాబితాలోకి వెళ్లిపోయింది. అసలు కరోనా సెకండ్ వేవ్ లేకుంటే వసూళ్ల పరంగా మరింత మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవి. ఓటీటీలో వచ్చే నెలలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఆ ప్రభావం కూడా కొంత కలెక్షన్ల మీద పడుతుంది. ఈ కరోనా సమయంలో థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిన అవసరముందా అనుకున్నవారు మాత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.











