దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే లక్షా 46వేల కరోనా కేసులు నమోదవ్వడం అధికార యంత్రాంగానికి గుబులు పుట్టిస్తోంది. ఒక్క మహారాష్ట్రలోనే రోజుకు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు టీకా సరఫరా లేక మహారాష్ట్రలో టీకా వేసే కేంద్రాలు మూసి వేశారు. దేశ వ్యాప్తంగా డిమాండ్‌ను తట్టుకునే విధంగా కరోనా టీకాలు సరఫరా లేదని తెలుస్తోంది. మరో వైపు రేపటి నుంచి నాలుగు రోజుల పాటు కరోనా టీకా ఉత్సవం నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కరోనా సెకండ్ వేవ్‌ను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రధాన నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ముంబాయి, నాగపూర్, పూనే, అహ్మదాబాద్, గాంధీనగర్, ఢిల్లీ నగరాల్లో కంటెయిన్‌మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారానికి నాలుగు రోజుల పనిదినాలను ప్రవేశ పెట్టింది. ఢిల్లీలో రాత్రి 10 నుంచి తెలవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో కోటి మందికి పైగా కరోనా భారిన పడ్డారు. ఇంకా దేశంలో పది లక్షల యాక్టివ్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Danger Bells of Corona Second Wave :
టీకా వేగవంతం..
రేపటి నుంచి దేశంలో కరోనా టీకా ఉత్సవం ప్రారంభం కానుంది. రోజుకు 50 లక్షల మందికి టీకా వేయాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు పలు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే కరోనా టీకా అందుబాటులో లేకపోవడంతో కేంద్రం నిర్ధేశించిన లక్ష్యాలను చేరడం అనుమానంగానే ఉంది. ఏపీలో రోజుకు 6 లక్షల మందికి టీకా వేయాలని నిర్ణయించారు. అయితే టీకా అందుబాటులో లేకపోవడంతో ఉన్నతాధికారులు కేంద్రానికి లేఖ రాశారు. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో 24 లక్షల మందికి టీకా వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నా టీకా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మహా ఉగ్రరూపం
మహారాష్ట్రలో రోజుకు 50 వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వ్యాపార, వాణిజ్య కేంద్రం ముంబాయిలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా భారిన పడి 45 వేల మంది చనిపోయారు. ప్రతిరోజూ 600 మంది కరోనాతో చనిపోతున్నారు. అక్కడ కూడా టీకా అందుబాటులో లేకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్ర పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, గురజాత్ రాష్ట్రాలకు కూడా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అదుపు చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నా, ప్రజలు కనీసం మాస్కులు కూడా పెట్టుకోకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. నగరాల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి పెద్ద ఎత్తున జరిమానాలు వేస్తున్నా, జనం మాస్కులు పెట్టుకోకపోవడం కరోనా వ్యాప్తికి కారణం అవుతోంది.
తెలంగాణలో విస్తరిస్తోన్న కరోనా..
తెలంగాణలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఒక్క రోజులోనే 2909 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ నగరంలో మాస్క్ తప్పనిసరి చేశారు. లాక్ డౌన్ విధించే ఆలోచన లేకపోయినా కంటెయిన్‌మెంట్ జోన్లు అమలు చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. పలు ఆసుపత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చారు. ఇప్పటికే తెలంగాణలో 17 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కరోనా వైద్యం చేసేందుకు కొందరికి అనుమతించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకడం లేదు. దీంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు హెచ్చరించారు.
ఏపీలో అంతకంతకూ పెరుగుతోన్న కరోనా..
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. ఇప్పటికే ఏపీలో 11 లక్షల మంది కరోనా భారిన పడ్డారు. 8 వేల మందికి పైగా చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో 9 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజుకు 1500 కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే నాలుగు రోజుల్లో 24 లక్షల మందికి కరోనా టీకా వేయాలని సీఎం ఆదేశించారు. అయితే కరోనా టీకా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రైవేటు ఆసుపత్రులపై ఆంక్షలు..
కరోనా రోగులకు వైద్యం అందించే ప్రైవేటు ఆసుపత్రులపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయడంతో చాలా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్యం అందించేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేకపోవడం, ప్రైవేటుకు వెళదామంటే బెడ్లు దొరక్కపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు, విజయవాడ నగరాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకడం గగనంగా మారింది.
Must Read ;- కరోనా కొత్త లక్షణాలు ఇవే.. ఉంటే టెస్టు చేయించుకోండి!