
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లిక్కర్ ధరలు భారీగా పెంచడం అనేది ప్రభుత్వ ఖజానాకు ఏమాత్రం లాభించిందో తెలియదు గానీ.. ఆ పార్టీ నాయకులకు మాత్రం విపరీతంగా లాభసాటి వ్యాపారంగా మారిందనే వాదన చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. దీనికి ప్రత్యక్ష దాఖలాలు గతంలోకూడా అనేకం దొరికాయి గానీ.. తాజాగా బయటకు వచ్చిన వ్యవహారం అందరూ విస్తుపోయేలా చేస్తున్నటివంటిది. సాక్షాత్తూ బెజవాడ కనకదుర్గ ఆలయ పాలకమండి సభ్యురాలి కారులో భారీ మొత్తంలో లిక్కర్ స్మగ్లింగ్ జరుగుతుండగా పట్టుబడడం. అదే సమయంలో.. ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేయడం విస్మయపరుస్తోంది.
కృష్ణా జిల్లా, జగ్గయ్యపేటలో భారీగా మద్యం పట్టుబడింది. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వెంకటనాగ వరలక్ష్మి కారులో పెద్దమొత్తంలో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీతారాంపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్క్ చేసిన కారులో ఈ మద్యం స్వాధీనం చేసుకోవడం విశేషం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ మద్యం స్వాధీనానికి సంబంధించి.. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వెంకట నాగ వరలక్ష్మి భర్త ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్, వెంకట నాగ వరలక్ష్మి దంపతులు ఎమ్మెల్యే సామినేని ఉదయబానుకు కీలక అనుచరులు కావడం విశేషం.
మద్యం బాటిల్స్ విలువ రూ.40 వేలు ఉంటుదని పోలీసులు చెప్పారు. కేసు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనుక ఎవరున్నారో కూడా నిగ్గు తేలుస్తామని పోలీసులు చెప్పారు.

వైసీపీ నాయకుల దందా మామూలే..
ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెరిగిన నాటినుంచి.. దీనిని వైసీపీ నాయకులు ఒక అవకాశంగా మార్చుకున్నారనే అభిప్రాయం చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులకు ధరల పెంపు పండగ అయిపోయింది. వైసీపీ నాయకులు సరిహద్దు గస్తీలో ఉండే పోలీసులతో లాలూచీ పడి.. నిరంతరాయంగా ఇలా లిక్కర్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్టు కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. అయినా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.

తాజా ఘటన కూడా ఎప్పటినుంచో వినిపిస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగానే ఉంది. విజయవాడలో ఒక అపార్ట్ మెంట్ పార్కింగ్ లో ఉన్న కారులోంచి మద్యం స్వాధీనం చేసుకున్నారు. అంటే అక్కడిదాకా సరిహద్దులు దాటి మద్యం ఎలా వచ్చిందన్నది చాలా కీలకమైన విషయం. పొరుగు రాష్ట్రాలనుంచి అయినా మూడు బాటిళ్ల వరకు మద్యం తెచ్చుకోవచ్చు అని హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. అయినా సరే పోలీసులు పట్టించుకోకుండా కేసులు పెడుతూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో నలభై వేల రూపాయల విలువైన మద్యం.. సరిహద్దులు దాటి పార్కింగ్ ఏరియా వరకు ఎలా వచ్చిందో అనుమానించాల్సిందే.
మాకు సంబంధం లేదనేస్తారా?
సాధారణంగా ఇలాంటి లాలూచీ దందాలు, వ్యవహారాలు బయటపడినప్పడు.. ఈ దందాతో తమకేమీ సంబంధం లేదని నాయకులు అనేస్తుంటారు. ప్రస్తుతానికి బోర్డు సభ్యురాలి భర్తను పోలీసులు అరెస్టు కూడా చేశారు. కానీ, ‘కారు మాత్రమే తమదని, అందులోకి లిక్కర్ ఎలా వచ్చిందో తెలియదని’ వారు బుకాయించే అవకాశం కూడా పుష్కలంగా ఉన్నదనే అభిప్రాయం వినిపిస్తోంది. పోలీసులు ఈ కేసులో ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాలి.











