ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోన్న ఆరు రాష్ట్రాల్లో ఏపీ చేరింది. దేశంలోని కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న 30 జిల్లాల్లో 7 జిల్లాలు ఏపీలోనే ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో నిన్న ఒక్కరోజే 3500పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా వేగంగా వ్యాపిస్తున్న జిల్లాల్లో తూర్పుగోదావరి దేశంలోనే రెండో స్థానంలో చేరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇదే వేగం కొనసాగితే మే నెలలోనే తూర్పుగోదావరి జిల్లాలో లక్ష మందికిపైగా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గని వేగం..
కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వేగం మాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్క రోజే ఏపీలో 23 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఆరు జిల్లాల్లోనే 13వేల కేసులు వెలుగు చూశాయి. ఇప్పటికే రాష్ట్రంలో 2.15 లక్షల పాజిటివ్ కేసులుండగా,ఇప్పటికే 17 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందులు దొరక్క కరోనా రోగులు వందల సంఖ్యలో చనిపోతున్నారు. కరోనా నియంత్రణ లోపాలపై హైకోర్టు సీరియస్ కావడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఏపీలో 18 గంటల కర్ఫ్యూ విధించారు.ఇక ఆరోగ్యశ్రీ కింద కరోనాకు ఉచితంగా చికిత్స చేయాలని ప్రైవేటు ఆసుపత్రులను ఆదేశించారు.ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స చేయకపోయినా, బెడ్లు కేటాయించకపోయినా క్రిమినల్ కేసులు పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది.











