చపాక్ స్టేడియంలో ఇంగ్లండ్ చెలరేగిపోతోంది. తొలిరోజే ఆధిక్యం సాధించింది. రెండోరోజు సైతం ఆ ఆధిపత్యాన్ని అలాగే కొనసాగించింది. ఫలితంగా.. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. 8 వికెట్ల నష్టానికి 555 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించింది.
తొలిటెస్టులో పర్యాటక జట్టు సత్తా
భారత్ – ఇంగ్లాండ్ తొలి టెస్టులో పర్యాటక జట్టు సత్తా చాటుతోంది. తొలిరోజు నుంచే పటిష్ఠ ప్రణాళికతో ముందుకెళుతోంది. రెండోరోజు 263/3 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ శనివారం ఆట ఆఖరుకు తొలి ఇన్నింగ్స్‌లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. రెండో రోజు ఆటను ప్రారంభించిన రూట్, స్టోక్స్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. రూట్ సాధికారికంగా బ్యాటింగ్ చేయగా, స్టోక్స్ కాస్త దూకుడుగా పరుగులు సాధించాడు. ఈ క్రమంలో స్టోక్స్ 73 బంతుల్లో అర్ధశతకం, రూట్ 260 బంతుల్లో 150 పరుగులు అందుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా తొలి సెషన్‌ను 355/3 స్కోరుతో ముగించింది. అయితే నదీమ్ స్టోక్స్‌ను ఔట్ చేయడంతో వీరిద్దరి శతక భాగస్వామ్యానికి తెరపడింది.
100వ టెస్టులో డబుల్ సెంచరీ..
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ భీకర ఫామ్ కొనసాగించారు. టీమిండియాతో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీ చేశారు. రూట్ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) గ్రేట్ స్కోరుతో ఉంది.
ప్రస్తుతం రెండో రోజు మూడో సెషన్ కొనసాగుతుండగా.. జోస్ బట్లర్ (5), డొమినిక్ బెస్ (1) క్రీజులో ఉన్నారు. సిబ్లీ 87, బెన్ స్టోక్స్ 82 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, నదీం తలో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. పిచ్ నుంచి సహకారం లేకపోవడంతో వికెట్లు కూల్చేందుకు టీమిండియా బౌలర్లు చెమటోడ్చక తప్పడం లేదు.
టీమిండియా జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షాబాజ్ నదీం
ఇంగ్లండ్ జట్టు:
బర్న్స్, సిబ్లీ, లారెన్స్, జో రూట్(కెప్టెన్), స్టోక్స్, ఓలి పోప్, బట్లర్, బెన్, ఆర్చర్, జాక్‌లీచ్, అండర్సన్











