తమిళంలో మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా వున్న కథానాయకులలో శింబు ఒకరుగా కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా ‘ఈశ్వరన్’ రూపొందుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సుశీంద్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘దీపావళి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగుతుందనే విషయం ఈ టీజర్ ను బట్టి అర్థమవుతోంది.
గుబురు గెడ్డం .. మెలి తిరిగిన మీసాలు .. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో శింబు కొత్తగా కనిపిస్తున్నాడు. ఇక ఆయన జోడీగా నిధి అగర్వాల్ మరింత గ్లామరస్ గా అనిపిస్తోంది. దర్శకుడు భారతీరాజా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆయన అంగీకరించారంటే ఈ కథలో విషయముందనే నమ్మకం సహజంగానే కలుగుతుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు టీజర్ చివర్లో చెప్పేశారు.
తమిళంలో దర్శకుడిగా సుశీంద్రన్ కి మంచి పేరు వుంది. ఆయన సినిమాలపై ప్రత్యేకమైన ఆసక్తిని చూపే అభిమానులు వున్నారు. అందువలన ఈ సినిమాపై ఆది నుంచి అంచనాలు పెరుగుతూనే వున్నాయి. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ తో సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న శింబు, ఈ సినిమాపైనే నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాతో కోలీవుడ్లోను పాగా వేయాలనే పట్టుదలతో నిధి అగర్వాల్ వుంది. మరి ఇంతమంది ఆశలను నెరవేర్చే బాధ్యతను తనపై వేసుకున్న ‘ఈశ్వరన్’ .. ఏం చేస్తాడో చూడాలి మరి.