కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇది పరీక్షా కాలం. రాజకీయంగా తన ఉనికిని, సమర్థతను నిరూపించుకోవడానికి అవినాష్ రెడ్డికి వైసీపీ చీఫ్ జగన్ చివరి పరీక్ష పెట్టబోతున్నారు. ఇందుకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే వేదిక కానున్నాయి. సొంత గడ్డపై వైసీపీని గెలిపించి, తన సత్తా ఏంటో చూపించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఏర్పడింది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రస్తుతం అవినాష్ ముందున్న అతిపెద్ద సవాలు. గతంలో జరిగిన పులివెందుల ZPTC ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. పులివెందుల మున్సిపాలిటీతో పాటు గ్రామీణ పరిధిలోని ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవాలు సాధించాలని టీడీపీ పట్టుదలతో ఉంది.
ఐతే…ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే అంగీకరించను, అలాంటి చోట్ల MLA, MP టికెట్లు కట్ చేస్తా అంటూ వైఎస్ జగన్ ఇప్పటికే సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలో ఏకగ్రీవం కాకుండా చూసుకోవడం అవినాష్‌రెడ్డికి పెద్ద టాస్క్‌గా మారింది.
గతంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో అధికార పక్షం వ్యూహాలను తిప్పికొట్టడంలో అవినాష్ ఫెయిల్ అయ్యారనే అసంతృప్తి జగన్‌లో ఉంది. ఈసారి అలా కాకుండా నామినేషన్ల ఘట్టం నుంచి పోలింగ్ వరకు అభ్యర్థులకు అండగా నిలవడం, అవసరమైన వారికి ఆర్థిక భరోసా కల్పించడం అవినాష్ బాధ్యతే. ఈ భారీ టాస్క్‌లో అవినాష్ సక్సెస్ కాకపోతే, ఆయనను పార్టీ కీలక బాధ్యతల నుంచి వైఎస్ జగన్ పూర్తిగా పక్కనబెట్టబోతున్నారని వైసీపీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. పులివెందులలో ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుని, జగన్ పెట్టిన ఈ చివరి పరీక్షలో నెగ్గితేనే అవినాష్ రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది, లేదంటే ఆయనకు సొంత పార్టీలోనే ప్రాధాన్యం తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.











