ఆకాశం మీద ఉమ్మేస్తే.. తిరిగొచ్చి మొహం మీదే పడుతుంది. పని చేసే ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. అలా చేసిన వాళ్లే అభాసుపాలవుతారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ వ్యవహారం ఇలాగే ఉంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతుందని.. ఎన్డీయే పాలనలో స్టూడెంట్స్ ప్రైవేటు స్కూల్స్‌కి వెళ్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. ఏపీ గవర్నమెంట్ స్కూల్స్‌లో చాలా ఏళ్ల నుంచి విద్యార్ధులు తగ్గిపోతున్న మాట నిజమే. కానీ ఎన్డీయే కూటమిలోనే ఈ ట్రెండ్ ప్రారంభైనట్లు చెప్పడమే పెద్ద అబద్దం.
గత రెండు దశాబ్దాల నుంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోసం ఏపీ యువత పెద్ద సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు వలస పోతోంది. చాలా మంది వలస వెళ్లిన చోటే స్థిర నివాసం ఏర్పరచుకొని పిల్లలను అక్కడే చదివిస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్ తగ్గుదల వైసీపీ హయాంలోనే భారీ స్థాయిలో ఎక్కువైంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో 4 లక్షల మంది 2023-24లో 2 లక్షల మంది 2025-26లో లక్షా యాభై వేల మంది విద్యార్ధులు తగ్గారు.
వైసీపీ హయాంలో పాఠశాల విద్యను నిర్లక్ష్యం చేసి.. ఉపాధ్యాయులను వైన్స్ షాపుల ముందు సెక్యూరిటీగా పెట్టడం.. నాడు నేడు పేరుతో నిధులన్నీ వైసీపీ రంగులు వేయడానికే తగలేయడం వంటి చర్యలతో విద్యా ప్రమాణాలు పడిపోయి, మౌలిక వసతుల కొరతతో.. లక్షల మంది పిల్లలు సర్కారీ బడులను వదిలేసి ప్రైవేటు స్కూల్స్ బాట పట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేశ్ తీసుకున్న చర్యలు.. చేస్తున్న అభివృద్ధితో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ పూర్వ వైభవం వస్తోంది. చాలా కాలం తర్వాత 2026-27 విద్యా సంవత్సరంలో తొలిసారి ఏపీ గవర్నమెంట్ స్కూల్స్‌లో చేరిన విద్యార్ధుల శాతం పెరిగింది. వాస్తవాలను వక్రీకరించి, అరకొర సమాచారంతో అర్ధసత్యాలు, అసత్యాలనే నిజాలని నమ్మించాలని చూడటం వైసీపీ అలవాటు. కానీ జగన్ చెప్పే అబద్దాలకు.. ప్రభుత్వం పక్కా ఆధారాలతో క్లారిటీ ద్వారా అసలు నిజం ప్రతి ఒక్కరికీ తెలుస్తోంది. ఆ విధంగా జగన్ అండ్ కో కూటమి ప్రభుత్వానికి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నట్లవుతోంది.











