ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల మూడు దశాబ్దాల కల సాకారమవుతోంది. లక్షల ఎకరాలకు సాగు నీరు.. లక్షల మందికి తాగు నీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు.. ఇప్పుడు మళ్లీ ఆయన చేతుల మీదగానే ఆరంభం కాబోతోంది. ఈ సందర్బంగా ఎక్స్ వేదికగా.. వెలిగొండ జలసిరులు అభివృద్ధికి రెక్కలు అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఆగస్టు 31న శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వెలిగొండ టన్నెల్‌లోకి నీటిని విడుదల చేసి నల్లమలసాగర్‌లోకి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్నో అవాంతరాలు, సవాళ్లను అధిగమించి.. భగీరథ ప్రయత్నంతో వెలిగొండ ఫేజ్ 1 పూర్తి చేసి కరువు నేలకు కృష్ణా జలాలను అందిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం తాను తీసుకున్న సంకల్పం నేడు సాకారమైందని.. తీవ్ర కరువు ప్రాంతమైన ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో ఇది గొప్ప మార్పు తీసుకువస్తుందని చెప్పారు. 1996 మార్చి 5న వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో తీసిన ఫోటోను ముఖ్యమంత్రి షేర్ చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్ 1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఫేజ్ 2 పూర్తయితే మరో 3.28 లక్షల ఎకరాలకు నీరు అందిచవచ్చు. సాగునీటితో పాటు ప్రతి ఇంటికి పైప్‌లైన్ల ద్వారా తాగునీరు అందించి.. పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ ఒక వెలుగుల దండ అవుతుందని అభివర్ణించారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు లక్ష కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తున్న ఉద్యానహబ్‌లో ప్రకాశం జిల్లాను కూడా చేర్చారు. మార్కాపురం జిల్లా మీదుగా వెళ్లే బెంగళూరు- విజయవాడ హైవే.. సమీపంలోని రామాయపట్నం పోర్టుల ద్వారా.. ఈ ప్రాంతంలో వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకోబోతున్నాయి. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా.. ఇదే తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు.











