ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా కీలక స్థానంలో నిలిచిన బొత్స కుటుంబం నుంచి మరో తరం రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ అనూషను రాజకీయ వారసురాలిగా తెరపైకి తెస్తూ చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠమే లక్ష్యంగా ఆమెను బరిలోకి దింపుతున్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ, ఈ ప్రకటనలో అసలైన సస్పెన్స్ వేరే ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.
తన కుమార్తెను జెడ్పీ చైర్మన్ బరిలో నిలుపుతామని చెప్పిన బొత్స సత్యనారాయణ, పార్టీ గుర్తు లేదా వైసీపీ ప్రస్తావనను తీసుకురాకపోవడం పట్ల అనుమానాలు వ్యమవుతున్నాయి. ఈ క్రమంలోనే బొత్స కుటుంబం జనసేన పార్టీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతోందనే వార్తలు స్థానికంగా హాట్ టాపిక్‌గా మారాయి. డాక్టర్ అనూషకు జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఖాయం చేసే హామీ లభిస్తే, అధికార కూటమి వైపు వెళ్లేందుకు బొత్స వర్గం వ్యూహాత్మక అడుగులు వేస్తోందన్నది ప్రధాన చర్చ.
ఒకవేళ ఈ పొలిటికల్ ఎంట్రీ నిజం కావాలంటే, అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాల నుంచి సంపూర్ణ సమ్మతి రావడం అత్యంత కీలకం. విజయనగరం జిల్లాలో దశాబ్దాలుగా బొత్స వర్గానికి, స్థానిక కూటమి నేతలకు మధ్య ఉన్న పాత విభేదాలు, సీట్ల సర్దుబాటు సవాళ్లను అధిగమించడం పైనే ఈ అడుగులు ఆధారపడి ఉన్నాయి.
విజయనగరంలో సుదీర్ఘకాలంగా ప్రభావం చూపుతున్న బొత్స కుటుంబం గనుక పార్టీ మారితే, ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణాలు తలకిందులవ్వడం ఖాయం. ఒకవేళ వీరు కూటమి గూటికి చేరితే, విజయనగరంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలనుంది.











