మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ జోగి రమేష్ ఫ్యామిలీ పంచాయితీ ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. జోగి ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. అత్తమామల వేధింపులపై కోడలు మేఘన విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొదలైన ఈ రచ్చ..ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. తనపై జోగి రమేష్ చేసిన ఆరోపణలన్నింటికీ మేఘన ప్రెస్ మీట్ పెట్టి మరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొడుకు లోపాలు దాచిపెట్టి తన జీవితం నాశనం చేయడమే కాకుండా, తిరిగి తనపైనే బురద జల్లడం కరెక్ట్ కాదని ఆమె తేల్చి చెప్పారు.
చంద్రబాబు, లోకేశ్‌లను తాను కలిసినట్లు జోగి రమేష్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు మేఘన. తనకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కలిశానని ఆమె క్లారిటీ ఇచ్చారు. గతంలో న్యాయం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్లినా కాలయాపన చేశారే తప్ప ఎలాంటి ఫలితం లేదని, కనీసం జగన్ ఆఫీస్‌కు వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని మేఘన ఫైర్ అయ్యారు. అప్పుడు సజ్జల దగ్గరికి ఎలా వెళ్లానో, ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ దగ్గరికి కూడా అదే న్యాయం కోసం వెళ్లానని సూటిగా ప్రశ్నించారు.
కుమారుడి లోపాలు తెలిసి కూడా జోగి రమేష్ తన గొంతు కోశారని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులమని చెప్పి పెళ్లి చేసుకుని, ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి మారాలని రాజీవ్ తల్లి శకుంతల బలవంతం చేశారని, హిందూ దేవుళ్లను అవహేళన చేశారని మండిపడ్డారు. అదనపు కట్నం తెస్తేనే తన భర్త రాజీవ్‌కు ఫీలింగ్స్ వస్తాయంటూ దారుణంగా మాట్లాడారని చెప్పారు. తనను కూతురిలా చూసుకున్నామని జోగి రమేష్ చెబుతున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలని, వాళ్లు పెట్టింది గోరుముద్దలు కాదని, విషపు ముద్దలంటూ ఘాటుగా బదులిచ్చారు. తన భద్రత కోసం తీసుకున్న వీడియోలను ఫేక్ AI వీడియోలంటూ బుకాయించడాన్ని తప్పుబట్టారు.
ఈ నరకం నుంచి తనకు విడాకులు ఇప్పించి విముక్తి కల్పించాలని, న్యాయం జరిగే వరకు పోరాడతానని మేఘన స్పష్టం చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తూ, మోసం చేసిన జోగి కుటుంబంపై న్యాయపోరాటం ఆపేది లేదని మేఘన తండ్రి కృష్ణగౌడ్ కూడా హెచ్చరించారు. తమకు న్యాయం జరగకపోతే జోగి రమేష్ ఇంటి ముందు కుటుంబంతో సహా ధర్నా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను వాళ్లు నేరుగా కోరుతుండటంతో ఈ ఇష్యూ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.











