(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
నిప్పు లేనిదే పొగ రాదంటారు.. జిల్లా సమీక్ష సమావేశం సాక్షిగా పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతం అయ్యాయి.. అన్న ప్రచారానికి మరింత బలం చేకూరేలా.. శుక్రవారం ఎమ్మెల్యేలు ప్రకటన చేశారు. పలువురు ఎమ్మెల్యేలతో ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం విశాఖ లోని ప్రభుత్వ అతిథిగృహంలో సమావేశం నిర్వహించారు. దీంతో ఆ రెండున్నర గంటల భేటీలో ఏం జరిగింది.. అన్న చర్చ మొదలైంది.
సమీక్ష సమావేశంలో ‘నాడు – నేడు’ పనులపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే విధంగా భూ ఆక్రమణలపై ప్రస్తావించిన సందర్భంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఆరోపణలను ఖండించారు. ఈ పరిణామాల తర్వాత నిర్వహించిన ఈ సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. పార్టీ సంస్థాగత పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రేటర్ ఎన్నికలపైనా చర్చ జరిగింది. ఈ భేటీ అనంతరం… తమకు, అధిష్టానానికి మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని గుడివాడ అమర్నాథ్ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆయనకే తెలియాలి.
పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారనేది సామెత.. కానీ.. వైసీసీ ఎమ్మెల్యే మాటలు ఎలా ఉన్నాయంటే.. పుచ్చకాయల దొంగతనం ప్రస్తావన ఎవరూ తేకముందే.. నేను దొంగలించలేదు.. అని ప్రకటన చేసినట్టుంది. ఏ విభేదాలు లేనప్పుడు దాన్ని ప్రస్తావనే అనవసరం. ఎమ్మెల్యే అమర్ నాథ్ ను హైకమాండ్ అమరావతికి పిలిపించిందని, అక్కడ అక్షింతలు పడ్డాయని ప్రచారం జరిగింది.
తాను ఎక్కడికి వెళ్లకుండానే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమీక్ష సమావేశం పై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఖండించారు. అభివృద్ధి చర్చ పేరిట ఈ భేటీలో ఎమ్మెల్యేలకు ఎంపీ విజయసాయిరెడ్డి హితబోధ చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.