టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యతలు మారుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో ముఖ్యమంత్రి మార్పు తథ్యం అన్న వార్తల నేపథ్యంలో ఎవరెవరికీ ఏ పదవి వస్తుందన్న దానిపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ముఖ్యనేతలకు ఎలాంటి పదవులు దక్కబోతున్నాయి.. ఉద్యమకారులకు ఇకనైనా ప్రాధాన్యత పెరుగుతుందా అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. పార్టీలో ఇప్పటి వరకు కేసీఆర్ సుప్రీం.. పార్టీ అధ్యక్షుడిగా ఉండటమే కాకుండా .. ముఖ్యమంత్రిగా కూడా తిరుగులేని నేతగా ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన ప్రయారిటీలు మారిపోయాయని.. ఆయన ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు వచ్చాయి. వచ్చే వారు వచ్చినా.. పోయేవారు పోయినా ఆయన తొణకలేదు బెణకలేదు. ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నారు. దానికి తగ్గట్టే రెండోసారి కూడా తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.
గత ఏడాది నుండి ముఖ్యమంత్రి మార్పు అంటూ ప్రచారం..
ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిపోతారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. గత ఏడాదే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రచారాలు కామన్ గా మారిపోయింది. అయితే ముఖ్యమంత్రే స్వయంగా నేను ఎందుకు దిగిపోతానంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే ఈ సారి మాత్రం మరింత బలంగా ఊహాగానాలు వస్తున్నాయి.
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తరువాత ఆయన ఢిల్లీకి వెళ్ళిన ఆయన కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు అనుమతి తీసుకుని వచ్చాడని రాజకీయ చర్చ ప్రారంభమైంది. వచ్చే నెల 17న ముఖ్యమంత్రి జన్మదినం తరువాత కేటీఆర్ సీఎం కుర్చీపై కూర్చోవడం ఖాయం అంటున్నారు. ఇక ఆయన తాజాగా యశోదా ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకువచ్చిన తరువాత ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
‘ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి’ వ్యాఖ్యలతో ఎవరి ఆశల్లో వారు..
ఈ సారి ముఖ్యమంత్రిగా కేటీఆర్ కాబోతున్నాడని బలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో నేతలు ఊహల పల్లకీలు ఎక్కేస్తున్నారు. పోర్ట్ ఫోలియోలపైనా విస్తృత చర్చ సాగుతుంది. పార్టీ సీనియర్ నేతలు ఇద్దరికి కీలక పదవులు దక్కబోతున్నాయని చెబుతున్నారు. ఉద్య మకారుడు.. కేసీఆర్ తో మొదటి నుండి కలిసి నడిచిన ఈటెల రాజేందర్ డిప్యూటీ సీఎం అవుతాడంటున్నారు.
మరోవైపు కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడింట్ పోస్టు ఇస్తారని .. దాస్యం వినయ్ భాస్కర్, వివేకా నంద, పట్నం మహేందర్ రెడ్డిలకు కూడా కీలక పోర్టు ఫోలియోలు ఇస్తారంటూ టీఆర్ఎస్ పార్టీలో చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిగిపోతాడో లేదో తెలియదు.. సీఎంగా ఆయన తనయుడు కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తాడో తెలియదు కాని రాష్ట్రంలో ఊహాగానాలు మాత్రం విచ్చల విడిగా వచ్చేస్తున్నాయి. ఈ ఊహాగానాలే నిజమవుతాయా.. లేక కేసీఆర్ వాటన్నింటినీ పటాపంచలు చేస్తారో వేచి చూడాలి.











