రవితేజ ఈ సారి సరాసరి సంక్రాంతి బరిలోకి దిగిపోయాడు .. ‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. శ్రుతిహాసన్ కథానాయికగా అలరించిన ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ .. సముద్రఖని కీలకమైన పాత్రలను పోషించారు. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి హిట్ టాక్ రావడంతో, ఈ సినిమా టీమ్ వైజాగ్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను గురించి మాట్లాడారు.
” లాక్ డౌన్ తరువాత కరోనా భయాన్ని పక్కన పెట్టేసి ప్రేక్షకులు పెద్దసంఖ్యలో థియేటర్స్ కి వచ్చి ఈ సినిమా చూస్తున్నారు. అందుకు వాళ్లకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విజయానికి ప్రధానమైన కారకులు వారే. ఇక వాళ్లను థియేటర్స్ కి రప్పించింది మా రవితేజనే .. ఆయన ఎనర్జీనే. రవితేజతో నాకు చాలాకాలం నుంచి పరిచయం ఉంది. దర్శకుడిగా నా కెరియర్ ఆయన సినిమాతోనే మొదలైంది. ‘డాన్ శీను’తో నాకు ఆయన అవకాశం ఇచ్చారు. ఆ తరువాత ఇద్దరం కలిసి ‘బలుపు’ సినిమా చేశాము.
మూడో సినిమాగా ఇప్పుడు ‘క్రాక్’ చేశాము. రవితేజ కెరియర్లోనే అతి పెద్ద హిట్ ఈ సినిమానే అని అంటున్నారు. ఆ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా .. గర్వంగా ఉంది. మొదటి నుంచి నాకు ఎంతో సపోర్టుగా ఉంటూ నన్ను ఇంతవరకూ నడిపించిన రవితేజకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను .. ఆయనే నా బలం .. ఆయన లేకపోతే నేను. ఇక ఈ సినిమా విజయంలో రామ్ – లక్ష్మణ్ ఫైట్స్ ప్రధానమైన పాత్రను పోషించాయి. తమన్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది. అలాగే విష్ణు కెమెరా పనితనం కూడా ఈ సినిమాకి అదనపు బలాన్ని అందించింది” అంటూ చెప్పుకొచ్చారు.