ఆరడుగుల అందం..మొహం మీద పడే తల వెంట్రుకల రింగు.. ఆడపిల్లలకు అంతకంటే ఏంకావాలి. అందుకే అప్పట్లో ఆడపిల్లలు శోభన్ బాబు అంటే విపరీతమైన అభిమానం. అందం గురించి చెప్పేటప్పుడు శోభన్ బాబులా ఉన్నాడు, అలాంటి భర్త కావాలి అనేవారు.
అందరికీ తెలిసిన శోభన్ బాబుకూ అందరూ అనుకునే శోభన్ బాబుకూ తేడా చాలానే ఉంటుంది. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. 1937 జనవరి 14న రైతు కుటుంబంలో పుట్టారు. నాటకాలంటే ఉన్న ఆసక్తే నటన వైపు నడిపించింది. అలా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. మద్రాసులో లా చదువుతున్నా సినిమా ప్రయత్నాలు వదల్లేదు. ఉదయం కాలేజీ.. మధ్యాహ్నం స్టూడియోల చుట్టూ చక్కర్లు. హీరో అయితే శోభనా చలపతిరావు పేరు బోగాదని తనే తనే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నారు.
ఆయన ప్రయత్నాలు ఫలించి పొన్నులూరి బ్రదర్స్ నిర్మించిన ‘దైవబలం’లో ఎన్టీఆర్ పక్కన ఓ పాత్ర ఇచ్చారు. అది 1959 సెప్టెంబరు 17న విడుదలైంది. అదే సమయంలో మరో అవకాశం. చిత్రపు నారాయణరావు నిర్మించిన ‘భక్త శబరి’లో మునికుమారుడి పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అది సక్సెస్ కావడంతో శోభన్ బాబు అనే నటుడు ఉన్నాడని అందరికీ తెలిసింది.
సినిమా కష్టాలు షరామామూలే..
సినిమా కష్టాలకు ఎవరూ అతీతులు కారు. ఈ మాట శోభన్ బాబుకూ వర్తిస్తుంది. అప్పటికే ఆయనకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు. డబ్బుకు ఇబ్బందులు ఉన్నా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న పాత్రలు వచ్చినా వదలకుండా చేశారు. ‘గూఢచారి 116’లో చిన్న వేషం చేశారు. ‘పరమానందయ్య శిష్యుల కథ’లో శివుడి వేషం వేస్తే కేవలం రూ. 1500 కోసం చేశారు. ‘ప్రతిజ్ఞా పాలన’లో నారదుడి వేషానికి రూ.750 తీసుకుని చేశారు. ఆయనకు పాత్రలు రావడానికి ఎన్టీఆర్, ఏయన్నార్ కూడా రికమండ్ చేశారట.
ఈ మాట శోభన్ బాబు అనేక సందర్భాల్లో చెప్పారు. ‘వీరాభిమన్యు’లో మొదటిసారిగా టైటిల్ పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అందులోని అభిమన్యుడి పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చింది. 1969లో విడుదలైన ‘మనుషులు మారాలి’ శోభన్ బాబు నట జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ తర్వాత ‘మానవుడు దానవుడు’ మాస్ ఇమేజ్ వచ్చేసింది. ‘సంపూర్ణ రామాయణం’ శోభన్ పౌరాణిక పాత్రలకూ పనొకొస్తారని నిరూపించింది.
ప్రత్యేకమైన వ్యక్తిత్వం
దేనికైనా ఓ లెక్క ఉండాలనే తత్వం ఆయనది. ఎంత తినాలి? ఎంతసేపు పడుకోవాలి? ఎంత మాట్లాడాలి? ఎంత ఖర్చుపెట్టాలి?.. ఇలాంటివన్నీ ఆయనను చూసే నేర్చుకోవాలి. ఈరోజున సినిమా రంగంలో వారసులు హీరో ఎవరైనా ఉన్నారు అంటే శోభన్ బాబు అనే చెప్పాలి. ఆయనకు కుమారుడు ఉన్నా ఆయన్ని సినిమాల వైపు ఎంకరేజ్ చేయలేదు. ఆయన మనవళ్లు కూడా సినిమా రంగానికి దూరమే. హీరోగా ఎదిగాక అవకాశాల కోసం ఆయన ప్రయత్నించలేదు. ఎవరైనా సినిమా చేయాలని తన దగ్గరకు వస్తే మాత్రం ఆయన పెట్టే షరతులకు ఒప్పుకోవాలి. రెమ్యూనరేషన్ విషయంలో ఆయన చెప్పిందే వేదం.
అందుకే ఆయనకు ‘పిసినారి’ అనే ముద్ర కూడా వేశారు. ప్లానింగ్ తో ఆయన జీవితం ఉండేది. విందులు వినోదాలకు, విదేశీ ప్రయాణాలకూ ఆయన దూరం. ‘రాముడు పరశురాముడు’ సినిమా పాటకోసం మొదటిసారి విదేశాలకు వెళ్లినా ఎక్కువగా లోకల్ గా షూటింగులు జరిగే సినిమాలే ఎక్కువ. ఆమెరికాలో కూతురు ఉన్నాతక్కువగా వెళ్లేవారు. నచ్చని పని ఏదీ ఆయన చేయరు. 30 ఏళ్ల నట జీవితం.. 228 సినిమాల్లో నటన.. ఇదీ ఆయన జీవితం. 96లో ‘హలోగురు’తో నటనకు స్వస్తి చెప్పేశారు.
ఎందరికో మార్గదర్శి
శోభన్ బాబుకు సినిమా రంగంలో స్నేహితులు కూడా తక్కువే. నటుడు చంద్రమోహన్ తో మంచి స్నేహం ఉండేది. ఇప్పుడున్న వారిలో రాశి మూవీస్ అధినేత నరసింహారావుతోనూ ఆయనకు స్నేహం ఉంది. ‘నేను ఆయనకు వీరాభిమానిని. ఆయనతో నా పరిచయం కూడా అలాగే జరిగింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. నేను ఆయనతో సినిమా చేస్తాను అంటే నవ్వేవారు. ఆయన తీసుకునేదానికన్నా రెట్టింపు పారితోషికం ఇస్తానన్నా. నా మీద నమ్మకం కుదిరిందో ఏమో చివరికి ఒప్పుకున్నారు. అలా తీసిందే ‘బావామరదళ్లు’ సినిమా. అది పెద్ద హిట్టయింది. రెట్టింపు పారితోషికం తీసుకోలేదుగానీ మామూలుగానే తీసుకున్నారు. తను ఒక నియమం పెట్టుకుంటే దాన్నే ఫాలో అయ్యేవారు. అలా ఆయనతో ఆరు సినిమాలు తీశా.
రాజీపడి సినిమాలు చేయడం, పారితోషికం తగ్గించుకుని సినిమాలు చేయడం ఆయనకు నచ్చేది కాదు. ఈ విషయంలో చంద్రమోహన్ ను కూడా ఆయన చాలా సార్లు హెచ్చరించారు. ‘నీకు డబ్బులకు లోటు లేనప్పుడు ఆత్మాభిమానాన్ని చంపుకుని సినిమాలు చేస్తావెందుకు’ అనేవారు. ‘మొదట్లో నీకు ఎలాంటి గౌరవం ఇచ్చేవారో అంత గౌరవం దక్కితేనే సినిమాలు చెయ్యి..లేకపోతే ఇంట్లో ఖాళీగా కూర్చో’ అనేవారు. ఆయన ఎప్పుడూ డాక్టర్ల దగ్గరకు వెళ్లరు. మెడికల్ చెకప్ చేయించుకోరు. కార్డియో కరెస్ట్ వల్ల చనిపోయారు. మొదటే డాక్టర్లను సంప్రదించి ఉంటే అంత త్వరగా చనిపోయి ఉండేవారు కాదు.
మా తాత గారు 102 ఏళ్లు బతికారు.. మానాన్నగారు 95 ఏళ్లు బతికారు.. నేను ఎట్ లీస్ట్ నైన్టీ అయినా బతుకుతాను అనేవారు. నటన నాతోనే ఆగిపోవాలి అనేవారు. సినిమా ఒప్పుకుని రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నాక ఆ డబ్బుతో ఎక్కడ స్థలాన్ని కొనాలో ముందే ప్లాన్ చేసుకునేవారు. జీవితం పట్ల ఆయనకు ఉన్న క్లారిటీ ఇంకెవరికీ లేదు. నాగయ్య, డబ్బులు మన దగ్గర ఉన్నపుడు మన గౌరవాన్ని ఎందుకు కోల్పోవాలి అనే మనస్తత్వం ఆయనది. చిత్తూరు నాగయ్య, కాంతారావు, రాజనాల… కొందరిని ఉదాహరణగా పేర్కొనేవారు. వాళ్లని ఎలా ట్రీట్ చేసేవారో చెప్పేవారు. అందగాడు అనే పేరు ఉన్నపుడు ఆ అందం లేకుండా ప్రేక్షకులకు కనిపించడం కూడా ఆయనకు ఇష్టం లేదు’ అని రాశి మూవీస్ నరిసింహారావు వివరించారు.
-హేమసుందర్ పామర్తి