వచ్చే ఏడాది నల్లగొండ, ఖమ్మం, వరంగల్ తోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్‌సి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీకి చెందిన పళ్ల రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి బిజెపి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో వీరి పదవీ కాలం ముగియనుంది.
దీంతో ఇప్పటి నుంచే అన్నీ రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలపై గురిపెట్టాయి. అయితే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీ చేయడమే కాదు టిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఈ సారీ తమ కైవసం చేసుకోవాలని ఆయన కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. తాను పోటీ చేసే స్థానం నుంచి తనకు ఎవరూ పోటీకి నిలబడకుండా ప్రొఫెసర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసమే కాంగ్రెస్‌తో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో కోదండరామ్ వెళ్తున్నట్లు సమాచారం.
మేమిక్కడ.. మీరక్కడ..
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి టిజెఎస్ పోటీ చెసేలా, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి స్థానం నుంచి కాంగ్రెస్ బరిలో నిలిచెలా ముందస్తు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిసింది. టిజెఎస్ పోటీ చేసే చోట, కాంగ్రెస్ మద్దతునిచ్చేలా, కాంగ్రెస్ పోటీ చేసే చోట టిజెఎస్ మద్దతిచ్చేలా ఇరు పార్టీలు అండర్‌స్టాండింగ్‌కు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. టిఆర్ఎస్ మినహా ఇతర పార్టీల మద్దతును కూడా కోదండరామ్ కోరినట్లు తెలిసింది.
ఇలా తన విజయానికి ఉన్న అవకాశాలను ఏమాత్రం జారవిరుచుకోకుండా ముందస్తు ప్రణాళికలతో అన్ని పార్టీల నాయకులతో టచ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. జిల్లాల వారీగా పర్యటనలు కూడా అప్పుడే ఆయన ముగించేస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో, మేధావులతో కోదండరామ్ చర్చలు ఇప్పటికే జరిపినట్లు తెలిసింది.
సారుకి గెలిచే అవకాశాలెక్కువ..
కోదండరామ్ నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్ స్థానాన్ని ఎంచుకోవడంలో ఓ లాజిక్కు ఉంది. ఇవి పట్టభద్రుల ఎన్నికలు కాబట్టి. కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోటగా ఖమ్మం, నల్లగొండలు ఉన్నాయి. అలాగే టిడిపి, కాంగ్రెస్‌కు కూడా ఓటు బ్యాంకు బాగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిలో సిపిఐ, టిడిపి, కాంగ్రెస్ టిజెఎస్ కలిసే పోటీ చేశాయా. కాబట్టి పోటీలో నిలబడితే తనకే మద్దతు ఇవ్వాలని టిడిపి, కాంగ్రెస్, సిపిఐకి కోరే అవకాశం ఉంది. ఇక ఒక్క సిపిఎం మద్దతును కూడగట్టుకోవాలసి ఉంటుంది. ఆ జిల్లాల్లో బిజెపికి అంత పట్టలేదు. టిఆర్ఎస్‌కు సిట్టింగ్ స్థానం. కాబట్టి సాధారణంగానే ఆ పార్టీ అభ్యర్థిపై వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది.
అలాగే వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచింది. విద్యావంతులు, విద్యార్థులు కోదండరామ్ వైపే ఎక్కువగా మద్దతు చూపే అవకాశం ఉంటుంది. ఈ స్థానం నుంచి పోటీ చేస్తే కోదండరామ్‌కు గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. అదే ఒకవేళ హైదరాబాద్ నుంచి గనుక కోదండ రామ్ పోటీ చేస్తే తనకు విజయవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నల్లగొండ నుంచి టిజెఎస్….హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పోటీ చేసేలా ఆ రెండు పార్టీలు ముందస్తు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.











