పిల్లలు అన్నం తినమని మారం చేస్తే మనం ఏం చేస్తాం. బుజ్జగించో, బతిలాడో, ఆడిపించో వారికి తినిపిస్తాం. ఎంతకూ తినకుంటే సరేలే అని సరిపెట్టుకుంటాం. కానీ చెన్నైలో జరిగిన ఓ ఘటన విస్మయానికి గురిచేస్తుంది. ఐదేళ్ల పాప ఇడ్లీ తినలేదని ఆ పాప పెద్దమ్మ ఆ ముక్కుపచ్చలారని చిన్నారిని కర్కశంగా కర్రతో కొట్టి చంపేసింది. అసలు ఇలాంటి వారు కూడా ఈ సమాజంలో ఉన్నారా! అనే ఆశ్చర్యం, సందేహాలు కలుగుతున్నాయి. ఆడుకుంటున్న పాపను తీసుకొచ్చి మరీ చావబాదింది. తను ఒక మహిళై ఉండి కూడా ఈ విధంగా ఆ చిన్నారిని హింసించి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇడ్లీలు తినకుంటే చంపడమేంటీ!
ఐదేళ్ల పాప ఏమంత వయసు కూడా కాదు. సరిగ్గా మాట్లాడటం కూడా రాని వయసది. మంచి చెడు తెలవని అమాయకత్వం, కల్లకపటం ఎరుగని పసితనం. అలాంటిది ఆ చిన్నారిని ఎంతలా చావబాదితే గానీ చనిపోతుంది. తల్లి ప్రేమ అనన్యం అంటారు. తల్లి ప్రేమ కింద ఏదీ రాదంటారు. తను కూడా తన పిల్లలకు తల్లే కదా. తల్లి లేని పిల్లలు ప్రేమను పంచాల్సింది పోయి…ఇలా చావబాదుతూ చంపేయడమేంటని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మహిళలు కూడా ఇంకా మన మధ్యలోనే ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరొక్కరు ఇలాంటి ఘాతుకానికి ఒడికట్టరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడి పోలీసుల కథనం ప్రకారం చెన్నైలోని కళ్లకురిచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపంలోని మెల్‌విళి గ్రామానికి చెందిన రోసారియో, జయరాణి దంపతులకు రెన్సీమేరీ (5) అనే కుమార్తె ఉంది. మూడేళ్ల కిత్రం పాప తల్లి జయరాణి మృతిచెందడంతో ఆ చిన్నారి తన అమ్మమ్మ, పెద్దమ్మ(ఆరోగ్యమేరీ) దగ్గర ఉంటుంది. అయితే సోమవారం ఉదయం రెన్సీమేరీని ఇడ్లీ తినమని పెద్దమ్మ అయినటువంటి ఆరోగ్యమేరీ కోరింది. ఆ ఇడ్లీలు బాగాలేవని…తనకు వద్దంటూ ఆ చిన్నారి స్నేహితులతో ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. దీంతో కోపగించుకున్న ఆరోగ్యమేరీ అక్కడే స్నేహితులతో ఆడుకుంటున్న పాపను ఈడ్చుకుంటూ ఇంట్లోకి తీసుకొచ్చి, తలుపులు మూసి కర్రతో తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఆ చిన్నారి కేకలు వేస్తూ ఏడుస్తుండటంతోప చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి బాలికను విడిపించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై త్యాగదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి ఆ మహిళను అరెస్టు చేసినట్లు తెలిసింది.