టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 2014 నుంచి ఎంఐఎం మిత్రపక్షంగా ఉంటూ వస్తోంది. ఇరు పార్టీలు మంచి అండర్‌స్టాండింగ్‌తోనే ఉన్నాయనే భావన అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్ధీన్ అప్పుడప్పుడూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చిన సందర్భాలను మనం చూసే ఉంటాం. కానీ దీనికి భిన్నంగా ఎప్పుడూ లేనివిధంగా అక్భరుద్ధీన్ ఓవైసీ, కెసిఆర్ పరస్పరం విమర్శించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సిఎం కెసిఆర్, ఎంఐఎం ఎంఎల్ఏ అక్భరుద్ధీన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అంతకు ముందు రోజు పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా ఎంఐఏం పార్టీ వ్యతిరేకించి సభకు గైర్హాజరైంది.
మిత్రులను శత్రువులు చేసిన కరోనా….
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రకటన చేశారు. అనంతరం ప్రభుత్వం చేసిన ప్రకటన మీద ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఒవైసీ పెదవి విరిచారు. కరోనా వల్ల అన్ని రంగాలపైన ప్రభావం చూపిందని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ప్రజల జీవితాల మీద తీవ్ర ప్రభావం చూపిన కరోనా గురించి ప్రభుత్వం చేసిన పనులను కూడా కనీసం చెప్పుకోలేకపోయిందన్నారు. ప్రభుత్వ ప్రకటన కేవలం హెల్త్ బులెటిన్‌లా ఉందని పెదవి విరిచారు. పేదలకు రేషన్, డబ్బులు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్పుకోలేకపోయిందన్నారు. కనీసం మీరు చెప్పలేకపోయినా మేం చెబుతామంటూ కరోనా వారియర్స్‌కు ఆయన సెల్యూట్ చేశారు. అక్బరుద్దీన్ ఇలా ప్రభుత్వం మీద విమర్శల దాడి చేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ అడ్డు చెప్పారు.
మహాభారతం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందని కెసిఆర్ చెప్పారు. అయితే దీనికి అక్బరుద్దీన్ అభ్యంతరం తెలుపుతూ తానేమీ మహాభారతం చెప్పలేదని బదులిచ్చారు. దీంతో నేను మీకు చెప్పడం లేదంటూ కేసీఆర్ గట్టిగా చెప్పారు. సభలో కేసీఆర్ మాట్లాడుతుండగానే అక్బరుద్దీన్ గట్టిగా అరుస్తూ మాట్లాడారు. దీనిపై స్పందించిన సీఎం అంత గట్టిగా అరవడం ఎందుకంటూ అక్బరుద్ధీన్‌కు చురకలు అంటించారు. అదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా నినాదాలు చేశారు. కరోనాకు ఎదురొడ్డి డాక్టర్లు, మున్సిపల్ కార్మకులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు కింద డబ్బులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అని సిఎం చెప్పారు. అయితే వీటి గురించి ప్రభుత్వం చెప్పుకోలేదన్నారు.
దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూడొద్దన్నారు. అయితే తాను ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందనే మాట అనలేదని అక్బరుద్దీన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఈ వాగ్వివాదం జరిగిన తీరుకు నిరసనగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్బరుద్దీన్ సభ నుంచి వెళ్లిపోయారు.
ఎడ్వాంటేజీ కోసం కాంగ్రెస్ ఆరాటం..
అసెంబ్లీలో కెసిఆర్, అక్బరుద్ధీన్ మధ్య మాటల వాదోపవాదనలు జరుగుతున్న తరుణంలో త్వరగా ముగించాలంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్బరుద్దీన్ ఒవైసీకి సూచించారు. దీంతో అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌటయ్యారు. అలాగే ఆయన వెంట ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ పరిణామాలని సభలోనే ఉన్న కాంగ్రెస్ సభ్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అక్బరుద్ధీన్‌ను త్వరగా ముగించాలంటూ స్పీకర్ సూచించినప్పడు కాంగ్రెస్ ఎంఎల్ఎలు కల్పించుకొని అక్బరుద్దీన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం గమనార్హం. గతంలో కాంగ్రెస్, ఎంఐఎం దోస్తీ అందరికీ తెలిసిందే.
కాంగ్రెస్ అధికారానికి దూరమవ్వడంతో ఎంఐఎం టిఆర్ఎస్‌తో జతకట్టిన విషయం తెలిసిందే. అయితే సభలో జరిగిన పరిణామాలను ఒక సారి పరిశీలిస్తే ఎంఐఎంతో దోస్తీ చేసేందుకు కాంగ్రెస్.. సభలో ఇలా ఎంఐఎంకు సపోర్ట్‌గా నినాదాలు చేసిఉంటుందా అనే అనుమానాలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. చెప్పలేము కాలం కలసి వస్తే మిత్రులు కూడా కావొచ్చేమో. ఏదీ ఏమైనప్పటికీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది వీళ్లు మరోసారి నిరూపిస్తారేమో.











