ఏమిటి లోకం పలుగాకుల లోకం మనసన్నది ఒట్టి పిచ్చి మరుపన్నది మరో పిచ్చి అలాగిలా తోసిపుచ్చిఅనుభవించు తెగించీ… ఫటాఫట్ – అంతులేని కథ సినిమాలోని ఈ పాట జీవితాన్ని టేకిట్ ఈజీగా తీసుకోమని చెబుతోంది. ఈ పాటలో నటించిన ఫటాఫట్ జయలక్ష్మికి మాత్రం ఇది వర్తించలేదు. ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయిన తారల జీవితాల వెనక అంతులేని వ్యధ ఉంటుందని ఎందరికి తెలుసు? ఒకరు కాదు ఇద్దరు కాదు ఎందరో తారల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. అసలు అవి హత్యలా ఆత్మహత్యలా అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్టదు. తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇతడి మరణంపై నేటికీ రోజుకో వార్త వస్తోంది. అటు బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇదే పరిస్థితి. ఈ మరణాల వెనుక ఉన్న దారుణాలు మాత్రం ఎప్పటికీ బయటికి రావు. సుశాంత్ సింగ్ మరణం సినిమా రంగంలో నెపోటిజం (బంధుప్రీతి) అనే కొత్త పదాన్ని ముందుకు తెచ్చింది. అది ఏ ఇజం అయినా నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన సమయం వచ్చింది. ప్రతి సినిమాకీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా… మరి ఈ తారల మరణాల ఫ్లాష్ బ్యాక్ లోకి ఓ సారి వెళ్లి వద్దాం.
మార్లిన్ మన్రో మొదలుకుని ఎందరో…
1962 ఆగస్టు 5న ప్రపంచాన్ని కుదిపేసే వార్త ఒకటి వెలువడింది. అదేంటంటే ప్రముఖ హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో మరణం. ఆమె మంచం దగ్గర నిద్ర మాత్రం కనిపించడంతో అది ఆత్మహత్య అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత హత్య అని, డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడవల్లే మరణం అని తేల్చి కేసు క్లోజ్ చేసేశారు. అలా 36 ఏళ్లకే ఆమె జీవితం ముగిసిపోయింది. ఆమె మరణానికి ముందు అదే సంవత్సరం ‘సమ్ థింగ్ గాట్ టు గివ్’ సినిమా నుంచి ఆమెను తొలగించినట్లు వార్తలు వెలువడ్డాయి. అవి నిజాలేనని ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించింది. ఆమె తరచూ షూటింగులు ఎగ్గొట్టటంవల్లే సినిమా నుంచి తీసేయాల్సి వచ్చిందని నిర్మాతలు వివరణ ఇచ్చారు. ఆమె మరణానికి ముందు తన సహనటుడు పీటర్ ఫోన్ చేసి భోజనానికి ఆహ్వానించినా ఆమె సున్నితంగా తిరస్కరించింది. అతనికి గుడ్ నైట్ చెప్పేసి శాశ్వతంగా నిద్రలోకి జారుకుంది.
1993లో ఏప్రిల్ లో ఇలాంటి సంచలనమే రిపీట్ అయ్యింది. ముంబయిలోని ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్ నుంచి అందాల నటి దివ్వభారతి పడిపోయి మరణించడం మరో సంచలనం. ఆమె దూకిందా… ఎవరైనా తోసేశారా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. తెలుగు సినిమా రంగంలో నటి ప్రత్యూష మరణం పెద్ద సంచలనం. మొదట ప్రేమ జంట ఆత్మహత్యగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఆ తర్వాత అనేక మలుపులు తిరిగింది. ఆ జంట ఆత్మహత్యలో ఆస్పత్రిలో కోలుకున్న యువకుడు మాత్రం ఇప్పుడు ఎంచక్కా చక్కటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ప్రత్యూష మరణం వెనుక నిజాలు కూడా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాయి. న్యాయం కోసం ప్రత్యూష తల్లి ఎంత పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. బాలీవుడ్ నటి నఫీసా జియాఖాన్ మరణం కూడా ఈ కోవలోకే వస్తుంది. కేవలం మూడు సినిమాలతోనే ఆమె జీవితం ముగిసిపోయింది. సిల్క్ సిల్క్ సినిమాతో సంచలన తారగా ఎదిగిన సిల్క్ స్మిత మరణం కూడా మనకు డర్టీ పిక్చర్ ను చూపించింది. నాటి మీనాకుమారి నుంచి నేటి సుశాంత్ సింగ్ మరణం దాకా ఇలా చెప్పుకుంటూ పోతే లక్కెకు అంతే ఉండదు.
సుశాంత్ మరణంలో ఎన్నో కోణాలు
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి 50 రోజులు దాటినా ఇప్పటికీ ఈ కేసుపై దర్యాప్తు జరుగుతూనే ఉంది. ఈ మరణంలోని నిజాలు నిగ్గుతేల్చాలని నెటిజన్లు పట్టుబడుతున్నారు. గతంలోని చాలా మరణాల విషయంలో సోషల్ మీడియానే లేదు. సుశాంత్ మరణం గురించి పోలీసులు ఇప్పటికీ ఆరా తీస్తూనే ఉన్నారు. జూన్ 14న బాంద్రాలోని తన ఫ్లాట్ లో సుశాంత్ ఉరివేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. కెరీర్ చక్కగా సెటిల్ అయిన సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడాన్ని అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన జీవితం ముగిసిపోవడానికి ముందు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణం అందులో ఒకటి. ఆమె తన ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మరణం కూడా ఓ మిస్టరీనే. మరో అంశం సుశాంత్ తో సహజీవనం చేసిన రియా చక్రవర్తి కొద్ది రోజుల ముందు ఆ ఫ్లాట్ ను ఖాళీ చేసి వెళ్లిపోవడం. ఈ పరిణామాలు సుశాంత్ ను కుంగదీశాయని తెలుస్తోంది. సుశాంత్ మేనేజర్ దిశను ఓ ముఖ్యమంత్రి కొడుకు, ఓ హీరో మర్డర్ చేశారని బాలీవుడ్ నటి కంగన ఆరోపిస్తోంది. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ కోసం సుశాంత్ తో 14 కోట్ల డీల్ ను దిశ కుదిర్చిందనే వాదన ఉంది. సుశాంత్ ను వదిలి వెళ్లిపోయిన రియా తనతో పాటు సుశాంత్ డబ్బును కూడా తీసుకువెళ్లిపోయిందని సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలతో బాగా కుంగిపోయిన సుశాంత్ సరిగా భోజనం చేసేవాడు కాదని పనివాళ్లు చెబుతున్నాడు. పైగా పోలీసుల దర్యాప్తులో తేలిన మరో కొత్త అంశం నొప్పి తెలియకుండా ఎలా చనిపోవాలో తెలుసుకోవడానికి ఆయన గూగుల్ లో శోధించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నిటితోపాటు కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా ఈ మరణం విషయంలో వెలుగులోకి వచ్చాయి. సినిమా రంగంలో విపరీతమైన రాజకీయా
లు ఉంటాయనేది జగమెరిగిన సత్యం. ఎదుగుతున్న నటులను తొక్కేయడానికి కుట్రలు జరుగుతుంటాయని చెబుతుంటారు. ఎవరైనా ఎదుగుతుంటే వారి బలహీనతలను తెలుసుకుని తదనుగుణంగా పావులు కదుపుతుంటారని చెబుతుంటారు. ముఖ్యంగా తమ బంధువులే సినిమా రంగంలో ఎదగాలన్న దురుద్దేశంతో ఇలా చేస్తారంటారు. దీన్నే బంధుప్రీతిగా చెబుతున్నారు. ఇలా చలామణిలోకి వచ్చిందే నెపోటిజం అనే పదం. వీటితోపాటు ఇక్కడ మాఫియా కూడా తెరవెనుక రాజకీయాలు చేస్తుంటుంది. ఇలాంటి కనిపించని కుట్రల వెనుక నిజాలు నిగ్గుతేల్చాల్సిన సమయం ఆసన్నమైనట్లుగానే ఉంది.
–హేమసుందర్











