ఎవరు హీరో… ఎవరు విలన్? ఈ సరిహద్దు రేఖను కరోనా చెరిపేసింది. జీవితాలు తారుమారైనట్లుగానే హీరోలు విలన్లుగానూ, విలన్లు హీరోలుగానూ కనిపిస్తున్నారు. ‘మన స్టార్ బాగోలేకే ఈ కరోనా వచ్చింది’… అనుకుంటున్నవారు కొందరైతే ‘అయ్యో.. జనం బాగుంటేనే కదా మనస్టార్ బాగుండేది’ అని ఇంకొందరనుకుంటున్నారు. ఇక్కడే కరోనా నుంచి కాపాడాలంటే కరుణ ఒక్కటే మార్గమని అర్థమైనవారే దానకర్ణులుగా ప్రజలకు కనిపిస్తున్నారు. సోనూ సూద్ లాంటివారు ఇంతలా సేవలందిస్తుంటే అందరికీ అతనిలో విలనిజం కూడా కనిపించడం లేదు… ఇతనే నిజమైన హీరో అని స్తుతిస్తున్నారు. జనం డబ్బంతా ఎటుపోయిందో అర్థం కావడం లేదు…. బతుకుదామంటే మార్గం కనిపించడం లేదు. తృణమో పణమో సంపాదించుకుంటే దాన్ని సినిమాలకో షికార్లకో తగలేశారు. కలెక్షన్ల రూపంలో ఎంతో డబ్బు పోగేసుకున్న హీరోలు ఏవో నాలుగు మెతుకులు మాత్రమే రాలుస్తున్నారు. ఈ తరుణంలో సోనూ జనానికి అపద్బాంధవుడిలా కనిపిస్తున్నాడు. అతను చేస్తున్న మంచి పనికి ‘శభాష్ సోనూ’ అని ట్వీటుతారా అంటే అదీ లేదు. ఛాలెంజ్ ల మీద ఛాలెంజ్ లు చేసుకుంటూ ‘మొక్క’వోని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
సినిమా కార్మికులు కలోగంజో తాగి బతుకుదామన్నా మార్గం కనిపించక సొంతూళ్లకు చెక్కేశారు. హీరోలు మాత్రం ప్రభుత్వ ఖజానాలో చెక్కులేశారు. అవి ఏమూలకొచ్చాయో ఎవరికీ తెలియదు. సీసీసీ అన్నారు… రెండు మూడు దఫాలు నిత్యావసరాలు పంచి మిన్నకున్నారు. ఆగస్టు వచ్చింది కదా మళ్లీ నిత్యావసరాలు అందుకోవడానికి పిలుపు ఏదన్నా వస్తుందా అంటే ఎక్కడా చడీచప్పుడు లేదు. వార్తల కోసం ఆవురావురుమంటున్న మీడియాను ట్వీట్లతో ఆదుకోవడం మాత్రం చేస్తున్నారు. ఎలాంటి పిలుపులూ రాకపోవడంతో సీసీసీ ఖజానా నిండుకుందేమోనన్న సందేహాలు వస్తున్నాయి. ఎవరెవరు ఏమిచ్చారు? ఎంతిచ్చారు? ఇంకెంత ఉంది అనే లెక్కలు మాత్రం ఇంకా తేలలేదు. సినిమాలు విడుదలైతే కలెక్షన్ల లెక్కలు మాత్రం కోటలు దాటుతాయి… ఇప్పుడు ఎన్ని కోట్లు ఎటు దాటాయో అంతుబట్టటం లేదు. ‘ఎంత సంపాదించామన్నది కాదన్నా… ప్రజలకు ఎంతిచ్చామన్నదే ముఖ్యం’లాంటి డైలాగులు ఏ హీరో నుంచి వస్తాయా అని జనం ఎదురుచూస్తున్నారు. ఓ అక్షయ్ కుమార్, ఓ సూనూ సూద్… లాంటి వారు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా దెబ్బలు కొడుతుంటే తట్టుకోడానికి వారు విలన్లు కాదు కదా హీరోలయ్యే. వారు ప్రశ్నించడానికే ఉంటారు… మనం మాత్రం ప్రశ్నించకూడదట. మెగా సారథ్యం ఒమెగా సారథ్యమే… విజయదేవరకొండ ఆర్గనైజ్డ్ గా చేయబోతుంటే రాళ్లేస్తారు… ఎవరు మాత్రం ఏంచేస్తారు సుమా? హీరోలెప్పుడూ జీరోలు కాదు… కాకూడదు.
పదోవంతు సాయం చేయలేరా?
ప్రతి మనిషీ తను సంపాదించిన దాంట్లో 10 వంతు దానం చేయాలని శాస్ర్తం చెబుతోంది. ఒక వర్గం ప్రజలు క్రమం తప్పకుండా అలాంటి సాయం చేస్తుంటారు. మరికొందరు గుప్తదానాలు చేస్తుంటారు. సినిమాల విషయానికి వస్తే చాలామంది హీరోలు, దర్భకకులు, నిర్మాతల దగ్గర ఉన్న డబ్బంతా ప్రజల నుంచి పోగుపడినదే. సంపాదించుకోవడం తప్పేమీ కాదు. కానీ విపత్కర పరిస్థితులు వస్తే కొంత ప్రజల కోసం వెచ్చించడంలో తప్పేమీలేదు. పైగా అది మంచి పనికూడా. కరోనా కాలంలో భారీ సాయం అందించిన వారిలో అక్షయ్ కుమార్, సోనూ సూద్ ల పేర్లే ప్రముఖంగా వినిపించాయి. ఈ ఇద్దరూ స్వయంకృషితో సినిమా రంగంలో ఎదిగిన వారే. కానీ తాము సంపాదించిన సొమ్ములో ఎంత ఖర్చుచేయడానికైనా వారు వెనుకాడటం లేదు. వీరి సాయం గురించి తెలిసిన హీరోలు వీరిపై గుర్రుగా ఉన్నాఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదే విషయంలో తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్న కుమార్ ను అడగ్గా దీనిపై ఆ హీరోలే ఎవర్ని వారు ప్రశ్నించుకోవాల్సిన అంశం ఇదని అన్నారు. నిజానికి రూ. 100 కోట్లు సాయం అందించగలిగిన సామర్థ్యం మన హీరోలకు ఉందన్నారు. ఇది విచక్షణకు సంబంధించిన అంశం కాబట్టి దీనిపై ఇంతకన్నా తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు. కాకపోతే సోనూ సూద్ చాలామందికి స్ఫూర్తినిచ్చారని అన్నారు.
నటుడు నరేష్ వ్యవహారంతో పవిత్ర లోకేష్ కి ఊహించని షాక్ !
సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇండస్ట్రిలో కాక రేపుతున్న...