పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేసిందని, దీనిపై మా నాయకుడు నిలదీస్తే 14 మందిని సస్పెండ్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకే అసెంబ్లీకి వచ్చామని, అయినా సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బుచ్చయ్య దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను తిట్టడమే సీఎం పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. సీఎం కనుసన్నల్లో సభ నడవాలా? అని ప్రశ్నించారు. సభా సంప్రదాయాలను మంటగలుపుతున్నారని, సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు లాంటి వాళ్లను కూడా సస్పెండ్ చేశారని బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే కేంద్రాన్ని అడగలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.
బయట కూడా మార్షల్స్ హడావుడి
అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలపై మార్షల్స్ దురుసుగా వ్యవహరించారు. వీడియోలు తీస్తున్న ఎమ్మెల్యే సహాయకులను తోసివేశారు. దీంతో టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మార్షల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను అసెంబ్లీకి రాకుండా చేసి మీడియా స్వేచ్ఛను హరించివేశారని కేశవ్ విమర్శించారు.











