అంతర్వేది ఘటన ఏపీలో రాజకీయ సెగ రాజేసింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశాయి. విశ్వ హిందూ పరిషత్,ఆర్ఎస్ఎస్ సంస్థలు ప్రభుత్వానికి నిరసనగా ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీ ఉద్రిక్తంగా మారడమే గాక పోలీసులు లాఠీచార్జి చేసే వరకు వచ్చింది. ఈ నిరసన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వ్యతిరేకంగా నినాదాలు కూడా వినబడ్డాయి. ఈ ఘటనపై టీడీపీ, జగన్, బీజేపీ పక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది రాజోలు నియోజకవర్గంలో ఉందని దానికి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ఉన్నారని అందుకే ఈ ఘటనపై జనసేన, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఆర్.ఎస్.ఎస్ ద్వారా రాజోలు నియోజవర్గంలో కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతాభిమానంతో, జనసేన కులాభిమానంతో కుళ్లిపోయాయని మండిపడ్డారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడికి కులాభిమానం ఎక్కువని, చిరంజీవిని సీఎం చేయాలనేది ఆయన లక్ష్యమని చెప్పుకొచ్చారు. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారారని ఎద్దేవా చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు కాగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సంగతిని గుర్తు చేశారు. అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన ఆయన ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ద్వంద నిర్ణయాలు తీసుకోరాదని సీఎంని కోరారు.
దళిత యువకుడికి శిరోముండనం చేయిస్తే సీబీఐతో విచారణ ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. సీఎం జగన్‌కు దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా సీతానగరం శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించాలి హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న హర్ష కుమార్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన 2004,2009లలో అమలాపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ లోనే కొనసాగిన ఆయన 2019లో టీడీపీలో చేరారు. కానీ టీడీపీ ఆయనకు సీటును కేటాయించలేదు. దీంతో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. అప్పడప్పుడూ తనదయిన శైలిలో రాజకీయాలపై కామెంట్స్ చేస్తూ హర్ష కుమార్ తమ ఉనికిని చాటుకుంటున్నారని జిల్లాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.