తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్ ఇచ్చింది. లోకేశ్ సేవలను జాతీయ స్థాయిలో మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూ పార్టీ నిర్ణయించింది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ, కేడర్‌ను సమన్వయం చేయడంలో ఆయన చూపుతున్న ప్రతిభను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించారు. రాష్ట్ర కమిటీతో పాటు అటు లోకేశ్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యత ఇప్పుడు పల్లాపై ఉంది.
మంత్రి లోకేశ్, పల్లా శ్రీనివాస్‌ల నియామకాలతో పాటు పార్టీ పొలిట్‌బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి కమిటీలను కూడా అధికారికంగా ప్రకటించారు. అనుభవం ఉన్న సీనియర్లతో పాటు, యువ నాయకత్వానికి ఈ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించారు. రాబోయే ఎన్నికలు, రాజకీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీలను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం లోకేశ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలను చూస్తున్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా రావడంతో, పార్టీలో ఆయన ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, అటు పార్టీ యంత్రాంగాన్ని రాబోయే ఎన్నికలకు సిద్ధం చేయడంపై కొత్త కమిటీలు దృష్టి సారించనున్నాయి.











