వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న వ్యవహారంలో సీబీఐ 11 కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా కేసులు నమోదు చేసింది. ఈ కేసుల విచారణలు త్వరలోనే కోర్టులో మొదలుకానున్నాయి. ఇప్పటిదాకా కేసుల విచారణ మొదలు కాని నేపథ్యంలో..వాటిపై జరుగుతన్న అనుబంధ పిటిషన్ల విచారణకు జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతున్నారు. అయితే ఈ కేసుల ట్రయల్ త్వరలోనే మొదలుకానున్న నేపథ్యంలో జగన్ వ్యక్తిగతంగానే కోర్టుకు హాజరు కాక తప్పదు. ఇలాంటి దశలో జగన్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న ఆదిమూలపు సురేశ్‌పైనా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైపోయింది. సురేశ్‌తో పాటు ఆయన సతీమణి, ఐఆర్ఎస్ అధికారిణి విజయలక్ష్మిపైనా ఇదే కేసు నమోదైపోయింది. ఈ కేసులను సాంకేతిక కారణాలతో కొట్టివేయించుకునేందుకు సురేశ్ దంపతులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఈ మేరకు శుక్రవారం నాడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సురేశ్ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తును కొనసాగించాలని సీబీఐకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి..
సురేశ్‌తో పాటు ఆయన సతీమణి విజయలక్ష్మి కూడా సివిల్ సర్వీసెస్ అధికారులే. విజయలక్ష్మి ఇండియన్ రోవెన్యూ సర్వీస్‌లో పనిచేస్తుండగా.. సురేశ్ మాత్రం ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్‌లో పనిచేసేశారు. 2009లో తన కొలువు వీడ్కోలు పలికిన సురేశ్.. రాజకీయాల్లోకి వచ్చేశారు. వచ్చీరాగానే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన సురేశ్.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డిని మెప్పించి మరీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టికెట్‌ను చేజిక్కించుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్సార్సీపీ పేరిట కొత్త కుంపటి పెట్టుకోగా.. సురేశ్ కూడా వైసీపీలో చేరిపోయారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవకర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేశ్ వరుసగా రెండో సారి కూడా ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తిరిగి తన సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలేనికి మారిన సురేశ్.. వరుసగా మూడో పర్యాయం కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. అంతేకాకుండా జగన్ కోటరీలో ముఖ్యుడిగా మారిపోయిన సురేశ్.. జగన్ కేబినెట్‌లో ఏకంగా విద్యాశాఖ మంత్రిగా పదవి దక్కించుకున్నారు. ఇప్పటికీ జగన్ గుడ్ లుక్స్‌లోనే సాగుతున్న సురేశ్ రాజకీయ పరంగా మంచి భవిష్యత్తు కలిగిన నేతగానే గుర్తింపు పొందారు.
భార్య చేతివాటాన్ని ప్రోత్సహించారట
సివిల్ సర్వెంట్‌గా కొనసాగినంత కాలం మచ్చ లేని అధికారిగానే పనిచేసిన సురేశ్.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన సతీమణి విజయలక్ష్మి అవినీతికి పాల్పడేలా ప్రోత్సహించారట. 2017లో ఈ మేరకు విజయలక్ష్మి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న విషయాన్ని పసిగట్టిన సీబీఐ.. ఆమెతో పాటు ఆమె అవినీతికి పాల్పడేలా ప్రోత్సహించారంటూ సురేశ్ పైనా కేసు నమోదు చేసింది. అంటే.. మంత్రిగా ప్రమోషన్ దక్కకముందే సురేశ్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్టే కదా. ఈ కేసు నుంచి తప్పించుకునే క్రమంలో సీబీఐ వ్యవహరించిన తీరును క్షుణ్ణంగా పరిశీలించిన సురేశ్ దంపతులు ప్రాథమిక దర్యాప్తు చేయకముందే తమపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని, ఈ పద్దతి చెల్లదని వాదిస్తూ.. తమపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాంకేతిక కారణాలను చూపిన సురేశ్ దంపతుల వాదన నిజమేనంటూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి సీబీఐ దర్యాప్తును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరగగా.. శుక్రవారం నాడు సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అవినీతి కేసుల్లో ప్రాథమిక దర్యాప్తు అనంతరమే చార్జిషీట్ దాఖలు చేయాలన్న నిబంధన ఏమీ లేదని, మంత్రి సురేశ్ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని సంచలన తీర్పు చెప్పింది. వెరసి ఇదే రకమైన కేసులో సీఎం జగన్ ఇప్పటికే పీకల్లోతు కూరుకుపోగా.. మీతో పాటే నేనూ అంటూ మంత్రి సురేశ్ కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధపడిపోయారు.
Must Read ;- రాజన్న రాజ్యం కాదు దోపిడీ రాజ్యం