రంజాన్ మాసంలో చేసే రోజా అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందులో నోరూరించే రంజాన్ వంటకాలను ఇష్టంగా తింటారు. పిండి వంటలు, శాఖాహార వంటకాలతో పాటు మాంసహార వంటకా లు ఎక్కువగా ఇష్టపడుతారు. ఖర్జూరలతో ఉపవాస దీక్షలను వదిలి ఆ తరువాత అన్ని రకాల పండ్లను అనంతరం వేడి, వేడి హలీం తింటారు. రోజంతా కఠోర దీక్షలు చేసే ముస్లింలు హలీంను ఇష్టంగా తినడంతో ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం. రంజాన్ మాసంలో పాతబస్తీ హలీంకు ప్రత్యేక స్థానం ఉంది. నగరంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు పాతబస్తీలోని హలీంను రుచిచూడకుండా ఉండలేరు.
40 ఏళ్ల వంటకం
హలీం పర్షియా వంటకం. కుత్‌బ్‌షాహీల కాలంలో మనకు పరిచయమైంది. ప్రస్తుతం ఇరానీలు సైతం పాత బస్తీ హలీం కోసం ఆరాటపడుతుంటారు. ప్రతిరోజూ పాతబస్తీలోని పేరుగాంచిన హోటళ్ల నుంచి అరబ్ దేశాలకు హలీం ఎగుమతి అవుతుంది. 40 ఏండ్ల కిందట నుంచి పాతబస్తీ హలీం అరబ్ దేశాలతో పాటు ముస్లిం దేశాలకూ వెళ్తుంటుంది.
పోషకాలు ఎన్నో…
ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, గోదుమరవ్వ, బాస్మతీబియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, నెయ్యి, గులాబ్‌పువ్వు, పెసర, మినిము, కంది, బాదం, ఉల్లిగడ్డ, కాజు తదితర వస్తువులను వినియోగించి హలీం తయారు చేస్తారు. గోదుమలతో పాటు పొటేల్ మాంసాన్ని నీటిలో ఉడుకబెట్టి ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి కర్రతో గిలగొడుతారు. ఇలా తయారైన మిశ్రమంలో నెయ్యి, కొత్తిమీర, వేయించిన ఉల్లిగడ్డలు వేసి వేడివేడిగా వడ్డిస్తారు. ఇంత బలవర్దమైన ఆహారం హలీం కాబట్టే అందుకే రంజాన్ స్పెషల్ డిష్ గా హలీంకు పేరుంది. చికెన్ హలీంను హరీస్ అంటారు. ఇది మటన్ హలీం కంటే చీప్‌గా దొరకుతుంది. రంజాన్ రుచులు ఆరగించాలనుకునే వారికి హలీం, హరీస్‌లు ప్రత్యేకమనే చెప్పాలి.